Eiffel Tower హఠాత్తుగా ఎందుకు మూసేశారు? హిందూ బృందం పర్యటనలో వింత షరతు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక 'ఈఫిల్ టవర్' వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ చారిత్రక కట్టడం వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను పక్కకు తప్పుకోవాలని యాజమాన్యం ఆదేశించడమే ఈ రచ్చకు కారణమైంది. భారతీయ హిందూ మత సంస్థ 'బీఎపీఎస్' కి చెందిన ప్రతినిధుల బృందం శనివారం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మగ ప్రతినిధులతో నిండిన ఆ బృందం వెళ్లేటప్పుడు మహిళా సిబ్బంది అక్కడ కనిపించకూడదని, వారి స్థానంలో మగ ఉద్యోగులను మాత్రమే విధుల లోకి తీసుకోవాలని యాజమాన్యం చెప్పినట్లు యూనియన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, కేవలం లింగ వివక్ష చూపిస్తూ మహిళలను విధులకు దూరంగా పెట్టడాన్ని నిరసిస్తూ ఈఫిల్ టవర్ ఉద్యోగులు సోమవారం ఉదయం సమ్మెకు దిగారు. 'ఆపరేషనల్ కారణాల వల్ల టవర్ ప్రారంభం ఆలస్యమవుతోంది' అని బోర్డులు పెట్టి అంతర్గతంగా నిరసన తెలిపారు. "విదేశీ అతిథుల కోసం మహిళలను పక్కకు తప్పుకోమనడం సరికాదు.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు" అని ఉద్యోగ సంఘం ప్రతినిధి డయానే దావోయిన్ స్పష్టం చేశారు. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.

తీవ్రంగా స్పందించిన పారిస్ మేయర్..
ఈ ఉదంతం ఫ్రాన్స్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. పారిస్ మేయర్ ఎమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ దీనిపై స్పందిస్తూ.. ఉద్యోగుల ఆగ్రహం సమంజసమేనని, పని ప్రదేశంలో ఎలాంటి లింగ వివక్షకూ తావు లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై అత్యవసరంగా సమగ్ర విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ వివాదంపై 'బీఎపీఎస్' సంస్థ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. తాము సాధారణ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఈఫిల్ టవర్ యజమాన్యంతో మాట్లాడే పర్యటనను ప్లాన్ చేసుకున్నామని.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పుకోవాలని తమ వైపు నుంచి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేసింది. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి చింతిస్తున్నామని తెలిపింది.
ఫ్రెంచ్ పట్ల ఆత్మగౌరవ పోరాటం!
ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాఎల్ బ్రౌన్-పివెట్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. "విదేశీ అతిథుల సంతృప్తి కోసం ఫ్రెంచ్ నేలపైన ఉన్న మహిళలు తమ ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదు. మా దేశ సంస్కృతిలో మహిళలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది.. వారిని ఎవరూ కనిపించకుండా చేయలేరు" అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో కొత్తగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఈ ప్రతినిధుల పర్యటనలో చోటుచేసుకున్న ఈ చిన్న పొరపాటు.. ఇప్పుడు పారిస్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications
