అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !!
భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు అత్యంత ప్రాధాన్యత లభించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్య జరిగిన ఈ పర్యటన భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలక మైలురాయిగా నిలిచింది.
మే 15న అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి యూఏఈ ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. భారత ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి యూఏఈ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అబుదాబి విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా మోదీకి ఆహ్వానం పలకగా, రెడ్ కార్పెట్ స్వాగతం, గౌరవ వందనం నిర్వహించారు.

భారత్-యూఏఈ సంబంధాలకు కొత్త దిశ..
ఇరుదేశాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, తాజా సమావేశాలు ఆ బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. రక్షణ, భద్రత, ఇంధనం, పెట్టుబడులు, వాణిజ్యం, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్-యూఏఈ మధ్య సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక రక్షణ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఇంధన భద్రతపై భారత్‌కు ఊరట..
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో భారత్‌కు యూఏఈ నుంచి కీలక హామీలు లభించాయి. ఒపెక్ పరిమితుల నుంచి యూఏఈ బయటకు రావడంతో చమురు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. దీనిని భారత్ సమర్థవంతంగా వినియోగించుకునేలా దీర్ఘకాలిక క్రూడాయిల్, LPG సరఫరా ఒప్పందాలు కుదిరాయి.
భారత్‌లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను (Strategic Petroleum Reserves) విస్తరించేందుకు యూఏఈ భాగస్వామ్యం పెంచనుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఇంధన కొరత లేదా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత్‌కు రక్షణ కవచంలా ఉపయోగపడనుంది. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన రంగంలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ, క్లీన్ ఫ్యూయల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపినట్లు సమాచారం.
భారత్‌లో రూ.41 వేల కోట్ల పెట్టుబడులు..
ఈ పర్యటనలో అత్యంత కీలక అంశంగా యూఏఈ నుంచి భారీ పెట్టుబడుల హామీ నిలిచింది. భారత మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో 5 బిలియన్ డాలర్లు (సుమారు ₹41,000 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ అంగీకరించింది. ఆర్‌బిఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ వంటి సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులతో పాటు పోర్టులు, లాజిస్టిక్స్, రైల్వేలు, స్మార్ట్ సిటీస్ అభివృద్ధిలోనూ భాగస్వామ్యం పెంచనున్నారు. గుజరాత్‌లోని వడినార్‌లో అంతర్జాతీయ స్థాయి షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
భారతీయ ప్రవాసులకు ప్రధాని సందేశం..
యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ప్రజల మధ్య బంధం మరింత బలపడుతోందని పేర్కొన్నారు. భారతీయ కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విద్య, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించేందుకు అంగీకారం కుదిరింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ, సమస్యలకు యుద్ధం కాదు.. చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం భారత్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, గాజా పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రత వంటి అంశాలపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం.
తదుపరి యూరప్ పర్యటన..
యూఏఈ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నార్వే పర్యటన చేపట్టడం విశేషం. ఈ పర్యటనల్లో రక్షణ, వాణిజ్యం, గ్రీన్ ఎనర్జీ, సాంకేతిక సహకారం, సెమీకండక్టర్ రంగాలపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది.












Click it and Unblock the Notifications