మోదీ-బైడెన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా- అదరగొట్టనున్న అమెరిన్ టాప్ సెలెబ్రిటీ
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించ తలపెట్టిన అమెరికా పర్యటన ఇంకో రెండు రోజుల్లో మొదలు కానుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ విరామం తరువాత భారత ప్రధాని తమ దేశ పర్యటనకు రాబోతోండటంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అమెరికా సన్నద్ధమౌతోంది.
21వ తేదీన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. 180 దేశాల ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు. అక్కడ ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తోన్నారు.

మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఈ విందు ఏర్పాటు కానుంది. అదే రోజు అటు అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
తన పర్యటన సందర్భంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ కానున్నారు. 23వ తేదీన రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డయాస్పోర రిసెప్షన్‌లో మోదీ పాల్గొంటారు. దీనికి భారత సంతతికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు హాజరు కానున్నారు.
ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు- ప్రఖ్యాత గాయని మేరీ మిల్‌బెన్. ఆఫ్రికన్- అమెరికన్ సింగర్ ఆమె. 21వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్‌లో నిర్వహించే యోగా సెషన్‌తో పాటు- ఇండియన్ డయాస్పొరాలోనూ మిల్‌బెన్ పెర్‌ఫార్మ్ చేయనున్నారు. తన ఆటపాటలతో అదరగొట్టనున్నారు. ఈ విషయాన్ని మేరీ మిల్‌బెన్ ధృవీకరించారు.

మోదీ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ తనను ఆహ్వానించిన స్టీరింగ్ కమిటీకి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ థీమ్‌తో ఈ సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోందని అన్నారు. ఈ థీమ్ భారత్- అమెరికా దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుతోందని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల భేటీలో మోదీకి స్వాగతం పలకడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తోన్నానని చెప్పారు.
2020లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనగణమణ గీతాన్ని ఆలపించడం ద్వారా భారతీయులకు చిరపరిచితులయ్యారు. అదే ఏడాది దీపావళి ఉత్సవాల్లో ఓం జై జగదీష్ హరే అనే శ్లోకాన్నిఆలపించారామె. ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఓ విదేశీ గాయనిగా చరిత్ర సృష్టించారు మేరీ మిల్‌బెన్.












Click it and Unblock the Notifications