డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ అలా కౌంటర్ ఇచ్చారా?
వాషింగ్టన్: అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఘాటైన సమాధానం ఇచ్చారా? అంటే పరోక్షంగా మోడీ ఆయనకు షాకిచ్చారని అంటున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ ప్రసంగంను పరిశీలిస్తే ఆయన పరోక్షంగా సమాధానమిచ్చారని తెలుస్తోందంటున్నారు.
స్థానిక నినాదంతో విదేశీయులపై అక్కసు వెళ్లగక్కడమే లక్ష్యంగా అధ్యక్ష పదవి రేసులోకి దూసుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ భారతీయ యాస వ్యాఖ్యలకు మోడీ గట్టి సమాధానమిచ్చారని అంటున్నారు. గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. భారతీయ ఉద్యోగులను ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.
మన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోతున్నారని అన్నారు. అంతేకాదు, ఓసారి తాను క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా తన సమస్యను వివరిద్దామని ప్రయత్నించానని, అప్పుడు అటునుంచి అమెరికన్ యాస వినపడలేదని, దీంతో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని ప్రశ్నించానని, అవతలి వ్యక్తి భారత్ నుంచి అని సమాధానమిచ్చాడని, తాను అద్భుతం అని ఫోన్ పెట్టేశానని అన్నారు.

దీనిని ప్రధాని మోడీ నేరుగా ప్రస్తావించలేదని, కానీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని మాత్రం అంటున్నారు. యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయులు అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
వ్యాపార, విద్యావేత్తలు, వ్యోమగాములు, అధ్యాపకులు, వైద్యులుగా వివిధ రంగాల్లో అమెరికాకు సేవలు చేస్తున్నారన్నారు. అలాగే అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో భారత సంతతి పిల్లలే గత కొన్నేళ్లుగా విజయం సాధిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications