SCO సదస్సుకు ప్రధాని మోదీ.. పుతిన్ తో కీలక భేటీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) కు హాజరుకానున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ సమ్మిట్ జరగనుంది. కిర్గిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జాపారోవ్ పంపిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కిర్గిస్థాన్ లో జరగనున్న 26 వ ఎస్సీఓ సదస్సుకు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో ఉజ్బెకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎస్సీఓ సమ్మిట్ చివరి రోజున ప్లీనరీలో ప్రసంగిస్తారని.. అంతేకాక ఆరో 'వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు, ఇతర ఎస్సీఓ దేశాల నేతలతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారని వివరించింది.
ఇక 26 వ షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనుంది. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంస్థ ఏర్పడి ఈ ఏడాదికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది సదస్సు ప్రత్యేకంగా నిలువనుంది. ఈ ఏడాది ఎస్సీఓ థీమ్.. సుస్థిర శాంతి కోసం.. అభివృద్ధి సంక్షేమం దిశగా.. కలిసికట్టుగా అని పెట్టారు. ఇక ఎస్సీఓ కూటమిలో మొత్తం 10 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ లు.. ఈ పది దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.
అయితే ఈ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి భేటీపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. ఇక ఇటీవల భారత విదేశాంగ మంత్రి జై శంకర్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23-24 తేదీల్లో ఆయన రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జైశంకర్ భేటీ అయ్యారు. సెప్టెంబరు 12, 13 తేదీల్లో దిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరుకావాలని జై శంకర్ ఈ మేరకు ఆహ్వానం అందించారు. దాంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన భేటీలో పలు అంతర్జాతీయ ద్వైపాక్షిక అంశాలపై జై శంకర్ చర్చించారు. భారత్- రష్యా సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా దృష్టి పెట్టడంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగు పడ్డాయని పుతిన్ హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications