వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్స్ ఫిలిప్‌: డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ఎవరు, ఆయన గొప్పతనం ఎలాంటిది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రాణికి నిరంతరం వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ప్రిన్స్ ఫిలిప్ విస్తృత గౌరవమర్యాదలను పొందారు.

నావల్ కమాండ్‌గా పని చేసి, పలు అంశాలపై బలమైన అభిప్రాయాలు కలిగిన మరెవరికైనా అలాంటి బాధ్యతలు చాలా కష్టం కావచ్చు. అయితే ఆయన బలమైన వ్యక్తిత్వమే రాణి సమర్థంగా తన బాధ్యతలను నిర్వర్తించడానికి ఉపయోగపడింది.

మహిళా దేశాధినేతకు సహవాసిగా ప్రిన్స్ ఫిలిప్‌కు రాజ్యాంగబద్ధమైన స్థానమేమీ లేదు. అయితే రాణికి ఆయనకన్నా దగ్గరవాళ్లు, ముఖ్యమైన వాళ్లు వేరే ఎవరూ లేరు.

గ్రీస్‌కు చెందిన ప్రిన్స్ ఫిలిప్ 10 జూన్, 1921లో కోర్ఫు ద్వీపంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రిన్స్ ఆండ్రూ, హెల్లెనెస్ రాజైన మొదటి కింగ్ జార్జ్ చిన్న కుమారుడు. ఆయన తల్లి ప్రిన్సెస్ అలైస్, బాటెన్‌బర్గ్ ప్రిన్స్ లూయిస్ చిన్న కుమార్తె మరియు ఎర్ల్ మౌంట్‌బాటెన్ ఆఫ్ బర్మాకు సోదరి.

1922లో తిరుగుబాటును విచారించిన కోర్టు ఆయన తండ్రిని గ్రీస్ నుంచి బహిష్కరించింది.

తండ్రి బంధువైన ఐదవ జార్జి రాజు పంపిన బ్రిటిష్ యుద్ధనౌక ఆ కుటుంబాన్ని ఫ్రాన్స్‌కు తీసుకెళ్లింది. ఆ ప్రయాణంలో చిన్నవాడైన ఫిలిప్ చాలా రోజుల పాటు ఒక బత్తాయి బాక్స్‌లతో చేసిన తొట్టిలో గడిపారు.

పిల్లలందరిలో ఫిలిప్ ఆఖరివాడు. ఫిలిప్ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో ఆయనొక్కడే మగ పిల్లవాడు. అక్కలందరి మధ్యా ఆయన బాల్యం సంతోషంగా గడిచిపోయింది.

ప్రిన్స్ ఫిలిప్ తన విద్యాభ్యాసాన్ని ఫ్రాన్స్‌లో ప్రారంభించినా, ఏడేళ్ల వయసులో ఆయన మౌంట్‌బాటెన్ బంధువులతో కలిసి జీవించేందుకు ఇంగ్లండ్‌కు తరలివెళ్లారు. అక్కడ సర్రేలో చదువు కొనసాగించారు.

అయితే అప్పటికే ఆయన తల్లికి స్క్రిజోఫ్రెనియా ఉన్నట్లు తేలడంతో ఆమెను మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అందువల్ల ప్రిన్స్ ఫిలిప్‌కు తల్లితో చాలా తక్కువ సంబంధాలుండేవి.

1933లో ఆయనను చదువు కొరకు దక్షిణ జర్మనీలోని శూలస్లాస్ సాలెం అనే ప్రదేశానికి పంపారు. దాన్ని ప్రముఖ విద్యావేత్త అయిన కర్ట్ హాన్ నిర్వహించేవారు. అయితే యూదుడైన హాన్ నాజీలకు భయపడి స్కాట్లండ్‌కు పారిపోయి అక్కడ గార్డన్‌స్టౌన్ పాఠశాలన ప్రారంభించారు. దాంతో ప్రిన్స్ ఫిలిప్ తిరిగి అక్కడ చేరారు.

ఆత్మవిశ్వాసం మీద ఎక్కువగా దృష్టి పెట్టే గార్డన్‌స్టౌన్ వాతావరణం తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్న ఆ టీనేజీ బాలునికి సరిగ్గా సరిపోయింది.

నౌకాదళ అధికారిగా విశిష్ట గుర్తింపు పొందిన ఫిలిప్

యుద్ధమేఘాలు కమ్ముకుంటుండగా, ప్రిన్స్ ఫిలిప్ మిలటరీ కెరీర్ వైపు మొగ్గు చూపారు. ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనుకున్నారు కానీ తల్లి తరపు కుటుంబసభ్యులు ఆయన నావికాదళంలో చేరాలని భావించడంతో ఆయన డార్ట్‌మౌత్‌లోని బ్రిటానియా రాయల్ నేవల్ కాలేజీలో చేరారు.

ఆరో కింగ్ జార్జ్, ఎలిజబెత్ రాణితో కలిసి కాలేజీలో పర్యటించడానికి వచ్చినపుడు, అక్కడ ఇద్దరు యువరాణులు ఎలిజబెత్, మార్గరెట్‌లకు ఫిలిప్‌ను ఎస్కార్ట్‌గా నియమించారు.

ఆ కలయిక 13 ఏళ్ల ఎలిజబెత్ యువరాణిపై గాఢమైన ముద్ర వేసింది.

చదువుల్లో అద్భుతంగా రాణించిన ప్రిన్స్ ఫిలిప్ జనవరి, 1940లో కాలేజీలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యారు. హిందూ మహాసముద్రంలో ఆయన తన మొదటి నావికా విన్యాసాలలో పాల్గొన్నారు.

1941లో మధ్యధరా నౌకాదళంలోని హెచ్‌ఎమ్మెస్ వాలియంట్‌లో పని చేసిన ఆయన, నౌకలోని సెర్చ్ లైట్ల విభాగానికి ఆఫీసర్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

అక్టోబర్, 1942 నాటికి ఆయన హెచ్‌ఎమ్మెస్ వాలెస్‌ నౌకపై పని చేసే రాయల్ నేవీలోని ఫస్ట్ లెఫ్టినెంట్లలో అత్యంత పిన్న వయస్కులు.

ప్రిన్సెస్ ఎలిజెబెత్‌తో ఆయన వివాహం యుద్ధానంతరం స్తబ్దుగా ఉన్న బ్రిటన్‌కు రంగులు అద్దిందని వర్ణించారు

ఎంగేజ్‌మెంట్

నావికాదళంలో ఉన్న కాలమంతా ప్రిన్స్ ఫిలిప్, యువరాణి ఎలిజబెత్ ఒకరికొకరు లేఖలు రాసుకుంటుండేవారు. అనేకసార్లు తమ కుటుంబంతో పాటు కలిసి ఉండేందుకు రావాలంటూ యువరాణి ఆయనను ఆహ్వానించింది.

1943 క్రిస్మస్ ఆహ్వానం సందర్భంగా, ఎలిజబెత్ నావల్ యూనిఫామ్‌లో ఉన్న ఫిలిప్ ఫొటోను తన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారు.

ఎలిజబెత్ యువరాణి బంధువుల్లో కొందరు ప్రిన్స్ ఫిలిప్ ''మొరటు, సభ్యత లేదు'' అని వంకలు పెట్టినా, వాళ్లిద్దరి మధ్యా అడ్డుగోడలు కట్టలేకపోయారు.

పట్టాభిషేకంలో రాణికి వందనం చేసిన మొదటి వారు ఫిలిప్

అప్పటికే ఎలిజబెత్ యువరాణి ఆయనతో ప్రేమలో మునిగి ఉన్నారు. 1946లో రాజుగారు తన కూతుర్ని వివాహం చేసుకోవాలని ప్రిన్స్ ఫిలిప్‌ను కోరారు.

అయితే ఎంగేజ్‌మెంట్‌కు ముందు ప్రిన్స్ ఫిలిప్‌కు ఒక జాతీయత, ఒక కుటుంబం అవసరమైంది. దాంతో ఆయన తన గ్రీకు పౌరసత్వాన్ని వదులుకుని, బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. మౌంట్‌బాటెన్ పేరిట తల్లి వారసత్వాన్ని స్వీకరించారు.

పెళ్లి ముందు రోజు ఆరవ జార్జి ప్రిన్స్ ఫిలిప్‌కు 'హిజ్ రాయల్ హైనెస్' అనే బిరుదును ప్రసాదించారు. పెళ్లిరోజు ఆయనకు 'డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్, ఎర్ల్ ఆఫ్ మెరియోనెత్ అండ్ బారన్ గ్రీన్‌విచ్' పదవులిచ్చారు.

వారి వివాహం 20 నవంబర్, 1947న జరిగింది. విన్‌స్టన్ చర్చిల్ ఆ వివాహాన్ని యుద్ధానంతరం స్తబ్ధుగా ఉన్న బ్రిటన్‌కు రంగులు అద్దిందని అన్నారు.

ముగిసిన కెరీర్

వివాహానంతరం డ్యూక్ తిరిగి నౌకాదళంలో తన కెరీర్‌ను కొనసాగించారు. ఆయనను మాల్టాలో నియమించగా - దంపతులిద్దరూ ఇతర నేవీ సిబ్బందిలాగే సాధారణ జీవితాన్ని గడిపారు.

1948లో బకింగ్ హామ్ ప్యాలెస్‌లో వారికి ప్రిన్సెస్ ఛార్లెస్, 1950లో ప్రిన్సెస్ ఆనీ జన్మించారు.

2 సెప్టెంబర్, 1950 లో ప్రిన్స్ ఫిలిప్‌ 'హెచ్‌ఎమ్మెస్ మ్యాగ్‌పై' కమాండ్‌గా నియమితులయ్యారు.

ప్రిన్స్ ఛార్లెస్ తాను చదివిన గార్డన్‌స్టౌన్‌లోనే చదువుకోవాలని ఫిలిప్ పట్టుబట్టారు

కానీ ఆరో జార్జి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుమార్తె రాచరిక బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ప్రిన్స్ ఫిలిప్ ఆమెకు తోడుగా నిలబడాల్సి రావడంతో 1951లో ఆయన తన నౌకాదళ కెరీర్ ముగింపు పలికారు.

1952లో ఆ దంపతులు కామన్‌వెల్త్ పర్యటనకు బయలుదేరారు. వారు కెన్యాలో ఉండగా గుండెలో రక్తం గడ్డ కట్టడంతో రాజు మరణించారన్న వార్త అందింది.

భార్య ఎలిజబెత్ సింహాసనాన్ని అధిష్టించడంతో తన బాధ్యత ఏమిటన్న దానిని ప్రిన్స్ ఫిలిప్ స్వయంగా నిర్ణయించుకోవాల్సి వచ్చింది.

పట్టాభిషేక మహోత్సవం సమీపించడంతో రాణి తర్వాత అన్ని విషయాలలో ప్రిన్స్ ఫిలిప్‌కే ప్రాధాన్యత ఉంటుందని రాజశాసనం వెలువడింది. అయితే రాజ్యాంగపరంగా మాత్రం ఆయనకు ఎలాంటి స్థానమూ ఉండదు.

ప్రభుత్వాన్ని ఆధునీకరించాలని ఆయనకు చాలా ఆలోచనలు ఉన్నా రాజకుటుంబంలోని అనేక మంది పాతకాపులు వాటిని అడ్డుకోవడంతో ఆయన చాలా నిరాశకు గురయ్యారు.

దాంతో ఆయన తన శక్తియుక్తులను సామాజిక సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు.

తన పిల్లలకు ఎవరి కుటుంబం పేరు ఉండాలన్న విషయంలో ఆయన ఓడిపోయినా, కుటుంబంలో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. రాణి కుటుంబం పేరు 'విండ్సర్' అనే పేరే తన పిల్లలకు రావాలన్న రాణి నిర్ణయం ఆయనను తీవ్రంగా బాధించింది.

''పిల్లలకు తన కుటుంబం పేరు ఇవ్వలేని తండ్రిని ఈ దేశంలో నేనొక్కడినే ఏమో!'' అని ఆయన తన స్నేహితుల వద్ద అనేవారు.

బలమైన వ్యక్తిత్వం

ప్రిన్స్ ఛార్లెస్ తన తాను చదువుకున్న గార్డన్‌స్టౌన్ లోనే చదువుకోవాలని ఫిలిప్ పట్టుబట్టారు. దాని వల్ల ఇతరుల్లో పెద్దగా కలవని కుమారుని తత్వం మారుతుందని ఆయన ఆశించారు. అయితే ఇంటి మీద బెంగ పెట్టుకున్న యువరాజుకు ఆ పాఠశాల నచ్చలేదు.

యువజనుల సంక్షేమం గటురించి ప్రిన్స్ ఫిలిప్ ఎక్కువగా ఆలోచించేవారు. ఆ ఆలోచనతోనే ఆయన 1956లో అత్యంత ప్రావీణ్యత ప్రదర్శించే యువత కోసం 'డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్' పురస్కారాన్ని ప్రారంభించారు.

''యువత ఏదైనా కార్యకలాపాలలలో విజయం సాధిస్తే, ఆ విజయం ఇతరుల్లో కూడా అతి వేగంగా వ్యాపిస్తుంది'' అని ఆయన ఒకసారి బీబీసీతో అన్నారు. తన జీవిత పర్యంతం డ్యూక్ చాలా సమయాన్ని ఆ కార్యక్రమం కోసమే వెచ్చించారు.

'నీతిబద్ధమైన...

వన్యప్రాణులు, పర్యావరణం అన్నా కూడా ప్రిన్స్ ఫిలిప్‌కు ఎంతో ఇష్టం. అయితే 1961లో భారత్‌లో పర్యటిస్తున్నపుడు ఆయన ఒక పులిని కాల్చడం వివాదాస్పదమైంది.

అయితే ప్రపంచ వ్యన్యప్రాణుల నిధి కోసం ఆయన ఎంతో శక్తిని, సమయాన్ని వెచ్చించారు. ఆయన కృషితోనే వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏర్పాటైంది. ఆయన దాని మొదటి అధ్యక్షుడిగా పని చేశారు.

''ఈ భూమి మీద వైవిధ్యభరితమైన ప్రాణికోటి ఉండడం చాలా అద్భుతమైన విషయం'' అని ఒకసారి ఆయన బీబీసీతో అన్నారు.

అయితే అడవికోళ్ల వేటను సమర్థించి ఆయన వన్యప్రాణి పరిరక్షకుల విమర్శలు ఎదుర్కొన్నారు.

ముక్కుసూటితత్వం

పరిశ్రమలంటే కూడా ప్రిన్స్ ఫిలిప్‌కు అమితాసక్తి. ఆయన తరచుగా ఫ్యాక్టరీలను సందర్శించేవారు. ప్రస్తుతం వర్క్ ఫౌండేషన్ అని పిలిచే ఇండస్ట్రియల్ సొసైటీలో ఆయన సభ్యుడిగా ఉండేవారు.

ఆయన ముక్కుసూటిత్వం కొన్నిసార్లు మోటుతనంగా కనిపించేది. దాని వల్ల ఆయన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేవారు. పరిస్థితులు సరిగా అంచనా వేయలేరని ఆయన అపప్రథ పొందారు.

1986లో రాణితో కలిసి చైనా పర్యటనకు వెళ్లినపుడు వాళ్ల కళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చైనా మీడియా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

అదే విధంగా 2002లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన ఒక ఆదివాసీని 'మీరు ఇంకా ఒకరిపై ఒకరు బల్లేలు విసురుకుంటారా?' అని ప్రశ్నించడం కూడా వివాదాస్పదమైంది.

ఉద్రిక్తతలు

అలాంటి వ్యాఖ్యలతో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనా, ఆయన స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన వారని, రాజకీయ పర్యవసానాలు పట్టించుకోని వ్యక్తి అని మరికొందరు అభిప్రాయపడతారు. అలాంటి వ్యాఖ్యాలను వాతావరణాన్ని తేలిక చేసేందుకు ఉపయోగించే పదజాలంగా భావించారు.

ప్రిన్స్ ఫిలిప్‌కు ఆటలంటే కూడా అమితాసక్తి. ఆయన సెయిలింగ్ చేసేవారు. క్రికెట్, పోలో ఆడేవారు. గుర్రబ్బగ్గీలను తోలడంలో నిపుణులు. అంతర్జాతీయ ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్‌కు అనేక ఏళ్లపాటు అధ్యక్షుడిగా సేవలు అందించారు.

జోనాథన్ డింబుల్‌బై రాసిన ప్రిన్స్ చార్లెస్ జీవిత చరిత్రతో ఆయనకు తన పెద్ద కుమారుడితో ఉన్న భేదాభిప్రాయాలు బయటపడ్డాయి.

లేడీ డయానా స్పెన్సర్‌ను చార్లెస్ పెళ్లాడడానికి కూడా ఆయన బలవంతమే కారణమని అనుకునేవారు.

తన పిల్లల కుటుంబాలు విచ్ఛిన్నమైనపుడు ఎన్నో విమర్శలు ఎదురైనా ఆయన వాటిని ఎంతో ఓర్పుతో ఎదుర్కొన్నారు.

బహుశా రాచ కుటుంబంతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం వల్ల తాను స్వయంగా ఎదుర్కొన్న సమస్యలు వల్లే ఆయన రాటుదేలి ఉండవచ్చు.

రాణి ఆయనను తన బలంగా వర్ణించారు

తీర్థయాత్రలు

తన నలుగురి పిల్లలలో ముగ్గురి వివాహాలు - ప్రిన్సెస్ ఆనీ, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఛార్లెస్ - విఫలం కావడంతో ప్రిన్స్ ఫిలిప్ చాలా బాధపడ్డారు.

అయినప్పటికీ వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించేవారు. 1994లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాను ఆ పనిని ఎన్నడూ చేయలేదని, ఇక ముందు కూడా చేయబోనని స్పష్టం చేశారు.

వయసు మీద పడుతున్నా ఆయన జీవితంలో ఉత్సాహం, వేగం మాత్రం తగ్గలేదు. వన్యప్రాణుల సంరక్షణ నిధి కోసం మరియు రాణితో కలిసి ఆయన అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించారు.

తన తల్లి సమాధి సందర్శన కోసం ఆయన 1994లో వ్యక్తిగతంగా జెరూసలేంకు తీర్థయాత్ర వెళ్లారు.

1995లో విక్టరీ ఓవర్ జపాన్ (వీజే) దినోత్సవ సందర్భంగా ఆయనకు ఒక కఠిన సందర్భం ఎదురైంది. జపాన్ లొంగిపోయినపుడు ఆయన టోక్యో బేలో ఒక బ్రిటిష్ డెస్ట్రాయర్‌పై ఉన్నారు. యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు వీజే సందర్భంగా రాణికి గౌరవ వందనం చేసే సందర్భంలో ఆయన కూడా వారితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతే కాకుండా జపాన్‌ మాజీ యుద్ధఖైదీల పట్ల జాలి వ్యక్తం చేసి, వారి విషయంలో జరిగిన అన్యాయం క్షమించరానిదంటూ వ్యాఖ్యానించారు.

అయితే ప్రిన్స్ ఫిలిప్ మొరటుతనం కాలక్రమేణా, మరీ ముఖ్యంగా డయానా మృతి అనంతరం మీడియా తమ కుటుంబం పట్ల వ్యతిరేకత పెంచుకోవడంతో కొంచెం తగ్గింది.

2007లో డయానా పట్ల వ్యతిరేకత లేదని చెప్పడానికి ప్రయత్నిస్తూ తనకు, యువరాణికి మధ్య జరిగిన లేఖలను బయటపెట్టడం జరిగింది.

'డియర్ పా లెటర్స్' అని పేర్కొన్న ఆ లేఖలు, ఆయన డయానాకు ఎంత వెన్నుదన్నుగా నిలిచారో వివరిస్తాయి.

డయానా చివరి సహచరుడు దోడి, ఆమె మరణంపై విచారణ జరిపించాలని, ప్రిన్స్ ఫిలిప్ ఆదేశాలపైనే ఆమెను హత్య చేశారని ఆరోపించారు. అయితే ఆయన వాటిని తీవ్రంగా ఖండించారు.

'నో-నాన్సెన్స్ దృక్పథం'

ప్రిన్స్ ఫిలిప్ నాయకత్వ లక్షణాలు సహజంగా అబ్బినవారు. పోరాట తత్వం కలిగిన ఆయన, తన పరిస్థితిపై తరచు అసహనం కనబరిచేవారు.

ఒకసారి బీబీసీతో మాట్లాడుతూ, ''నేను ఏది మంచి అనుకున్నానో దానిని చేశాను. నేను హఠాత్తుగా నా విధానాలను, ఏదైనా విషయం పట్ల నా ప్రతిస్పందలను మార్చుకోలేను. అది నా ధోరణి, అంతే'' అని తెలిపారు.

జూన్, 2011లో ఆయన 90వ జన్మదినాన ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''ఆయన ఎప్పుడూ ఇతరులు అనుకరించలేని పద్దతుల్లో పని చేశారు. చాలా సర్వసాధారణమైన మనిషి. ఆయన 'నో నాన్సెన్స్' విధానాన్ని బ్రిటిష్ ప్రజలంతా హర్షిస్తారు'' అని కామెరాన్ అన్నారు.

తన హోదా ద్వారా ప్రిన్స్ ఫిలిప్ కాలక్రమంలో బ్రిటిష్ రాచరిక వ్యవస్థ కాలానికి అనుగుణంగా మారడానికి దోహదపడ్డారు.

రాణి పాలనా కాలమంతా ఆమె వెన్నంటి ఉంటూ ఆమెకు సహకారం అందించడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం.

తమ వైవాహిక వార్షికోత్సవం సందర్భంగా రాణి తన భర్త గురించి చెబుతూ, ''ఆయన సాధారణంగా పొగడ్తలను ఇష్టపడరు. కానీ నిజం చెప్పాలంటే, ఇన్నేళ్లుగా నా బలం ఆయనే. నేను, నా కుటుంబం, ఈ దేశం ఇంకా ఇతర దేశాలు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము'' అంటూ తన ప్రేమను ప్రకటించారు.

English summary
Prince Philip: Who is the Duke of Edinburgh and what is his greatness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X