పుట్టపర్తి గుట్టు: నికోలస్ మదురో, సత్యసాయి బాబాకు ఉన్న సీక్రెట్ బంధం ఏంటి?
వెనిజులా రాజకీయాల్లో దశాబ్ధ కాలం పాటు తిరుగులేని శక్తిగా నిలిచిన నికోలస్ మదురో, అమెరికా దళాల మెరుపు దాడిలో బందీగా చిక్కడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఆ విప్లవ నేత వెనుక ఒక అరుదైన ఆధ్యాత్మిక కోణం ఉంది. అది మరేదో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చెందిన సత్యసాయి బాబా పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి. పుట్టపర్తి సత్యసాయి బాబాకు ఆయన పరమ భక్తుడు.
బస్సు డ్రైవర్ నుంచి బాబా భక్తుడి వరకు..
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో జీవితం అత్యంత సాధారణంగా మొదలైంది. కారకాస్‌లో ఓ బస్సు డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. కార్మిక నాయకుడిగా ఎదిగి చివరకు దేశాధ్యక్షుడయ్యారు. ఈ ప్రయాణంలో ఆయనకు ఆధ్యాత్మిక పరిచయం కలిగించింది ఆయన భార్య సిలియా ఫ్లోర్స్. 2000వ సంవత్సరానికి ముందే సిలియా ఫ్లోర్స్ సత్యసాయి బాబా బోధనలకు ఆకర్షితురాలయ్యారు. ఆమె ప్రభావంతోనే నికోలస్ మదురో కూడా బాబా భక్తుడిగా మారారు. నికోలస్ మదురో తన భార్యతో కలిసి 2005లో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్నిసందర్శించారు. అప్పట్లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉండేవారు. సత్యసాయి బాబాను కలిసిన సమయంలో వారు సాధారణ భక్తుల్లా నేలపై కూర్చుని ఉన్న ఫోటోలు నికోలస్ మదురో వినమ్రతకు నిదర్శనంగా నిలిచాయి.

అధ్యక్ష భవనంలో 'సాయి' కొలువు
నికోలస్ మదురో అధికారం చేపట్టాక కూడా తన ఆధ్యాత్మిక విశ్వాసాలను ఎప్పుడూ దాచుకోలేదు. వెనిజులా అధ్యక్ష భవనమైన 'మిరాఫ్లోర్స్ ప్యాలెస్'లోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో ఒక ప్రత్యేకత ఉండేది. వెనిజులా విముక్తి వీరుడు సైమన్ బొలివర్, తన గురుు హ్యూగో చావెజ్ చిత్రపటాల మధ్యలో సత్యసాయి బాబా నిలువెత్తు ఫోటోను మదురో అలంకరించుకునేవారు. ఆయన దేశంలో అనేక విదేశీ సంస్థలను బహిష్కరించినప్పటికీ.. సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలకు మాత్రం ఎప్పుడూ ఆటంకం కలిగించలేదు.
Recently, the Venezuelan government sent out invitations for its National Day Celebrations featuring a 🕉️, leaving many puzzled.
— Arun Pudur (@arunpudur) July 6, 2024
Few know that Venezuelan President Nicolás Maduro has been a Satya Sai Baba devotee for decades. Unfortunately, many Hindus are unaware of this and… pic.twitter.com/nwIv9Nv3U4
జాతీయ సంతాపం ప్రకటించిన ఏకైక దేశం!
2011లో సత్యసాయి బాబా మరణించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వెనిజులా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతం. మదురో చొరవతో వెనిజులా నేషనల్ అసెంబ్లీ సత్యసాయి బాబాకు నివాళిగా అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా గుర్తిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. "మానవాళికి బాబా అందించిన ఆధ్యాత్మిక సేవలు వెలకట్టలేనివి" అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
చివరి సందేశం: 'శతాబ్ది జయంతి' వేడుకలు
మదురో తన పదవి కోల్పోవడానికి కొన్ని నెలల ముందు, అంటే నవంబర్ 2025లో సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. "బాబా ఒక కాంతి స్వరూపుడు. ఆయన జ్ఞానం మనల్ని నిరంతరం నడిపిస్తుంది. ఆయనను వ్యక్తిగతంగా కలిసిన క్షణాలు నా జీవితంలో అత్యంత మధురమైనవి." - నికోలస్ మదురో
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉండి, డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం ఎదుర్కొంటున్న మదురో భవిష్యత్తు అంధకారంలో ఉంది. అయితే వెనిజులాలోని సత్యసాయి భక్తులు మాత్రం తమ దేశానికి ఈ ఆధ్యాత్మిక అనుబంధం రక్షణగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మదురో అరెస్టుతో వెనిజులా-భారత్ మధ్య ఉన్న ఈ 'ఆధ్యాత్మిక వంతెన' మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.












Click it and Unblock the Notifications