పాకిస్తాన్ తో పెరుగుతున్న దూరం--భారత్ వైపు తాలిబన్ల మొగ్గు- షరతులతో సాయానికి మనం రెడీ
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాగాతో భారత్ కు ప్రతికూల పరిస్దితులు తప్పవన్న అంచనాలు నిజం కాలేదు. పాకిస్తాన్ తో తాలిబన్లకు ఉన్న బంధం.. చైనా చేస్తున్న సాయం.. భారత్ కు ఆటంకాలు కల్పిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తో తాలిబన్లకు దూరం పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ గుర్తింపు విషయంలోనూ పాకిస్తాన్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదని భావిస్తున్న తాలిబన్లు.. భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా భారత్ అధికారికంగా తాలిబన్లతో చర్చలు మొదలుపెట్టడానికి కూడా ఇదే కారణం.

భారత్-ఆప్ఘన్ బంధం
భారత ఉపఖండంలో భాగమైన వ్యూహాత్మక ప్రాంతం ఆప్ఘనిస్తాన్ పై పట్టుకోసం వివిధ దేశాలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఉపఖండంలోని చైనా, పాకిస్తాన్ తో పాటు గల్ఫ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆప్ఘనిస్తాన్ భౌగౌళిక స్వరూపం దృష్ట్యా అంత తేలిగ్గా ఎవరికీ దీనిపై పట్టు చిక్కే అవకాశాలు లేవు. దీంతో 1996 నుంచి 2001 వరకూ తాలిబన్ల చేతుల్లో ఉన్న ఆప్ఘన్ కాస్తా ఆ తర్వాత హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ నేతృత్వంలో సాగిన ప్రజా ప్రభుత్వాల చేతుల్లోకి వచ్చింది. వీటికి నాటో దేశాలతో పాటు భారత్ వంటి దేశాలు కూడా సహకరించడంతో అప్ఘన్ లో పాకిస్తాన్ ఆటలు సాగలేదు. అదే సమయంలో భారత్-ఆప్ఘన్ బంధం కూడా బలపడింది.

అమెరికా ఉపసంహరణతో మారిన సీన్
తాలిబన్లతో ఒప్పందం చేసుకుని ఆప్ఘన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి తగ్గడంతో అక్కడ పరిస్ధితులు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడానికి బాటలు పడ్డాయి. దీంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలనపై దృష్టిసారిస్తున్నారు. అదే సమయంలో వారికి ఓవైపు ఐసిస్, మరోవైపు అల్ ఖైదా వంటి సంస్ధలతో ముప్పు పెరుగుతోంది. ఆప్ఘన్ లో తాలిబన్ల రీ ఎంట్రీతో తిరిగి పాగా వేసేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారు. కానీ అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలకు వీరు విఘాతం కలిగిస్తున్నారు. దీంతో ఐసిస్, అల్ ఖైదా వంటి సంస్ధలపై ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

పాకిస్తాన్ తో పెరుగుతున్న దూరం
తాలిబన్లకు దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పాకిస్తాన్ ఈసారి కొత్త ప్రభుత్వ ఏర్పాటులోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంది. ఇదే ఇప్పుడు తాలిబన్లకూ, పాకిస్తాన్ కీ మధ్య దూరం పెరగడానికి కారణమవుతోంది. పాకిస్తాన్ ఎంట్రీతో తాలిబన్లలో అధికార పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరిన నేతలకు అవకాశాలు దక్కకుండా పోయాయి. అదే సమయంలో పాకిస్తాన్ సూచించిన కొత్త నేతలు అప్పటికప్పుడు తెరపైకి వచ్చి మంత్రి పదవులు దక్కించుకున్నారు. అలాగే పాకిస్తాన్ ఒత్తిడితో తాలిబన్ల సర్కార్ లో చేరిన మోస్ట్ వాంటెడ్ నలుగురు హక్కానీలు ఇప్పుడు వారికి గుదిబండగా మారిపోయారు. వీరిపై నాటో దేశాలతో పాటు పాశ్చాత్యంలోని ఇతర దేశాల కన్నుంది. దీంతో హక్కానీలతో కూడిన తాలిబన్ సర్కార్ కు అంతర్జాతీయ గుర్తింపు దక్కకుండా పాశ్చాత్య దేశాలు అడ్డుపడుతున్నాయి.

భారత్ వైపు తాలిబన్ల మొగ్గు
పాకిస్తాన్ తో పెరుగుతున్న దూరంతో పాటు దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు భారత్ కు తాలిబన్లను దగ్గర చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు ఆర్ధికంగా బలంగా కనిపించిన తాలిబన్లు.. ఇప్పుడు అక్కడి ప్రజలకు అందించే సాయం విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆర్ధిక ఇబ్బందులే. దీంతో ఆప్ఘన్ ప్రజల్లో ఈ కారణంతో తిరుగుబాటు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉప్పుడు తాలిబన్లకు ఏర్పడింది కాబట్టి భారత్ వంటి దేశంతో సఖ్యత కొనసాగించడం ద్వారా మానవతా సాయం తీసుకోవాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ మేరకు భారత్ తో అధికారికంగానే తాలిబన్ల ఉప ప్రధాని చర్చలు కూడా జరిపారు. ఇందులో భారత్ వారికి కీలక హామీ ఇచ్చింది.

ఆ షరతుతో తాలిబన్ల సర్కార్ కు భారత్ సాయం
తాలిబన్ల నేతృత్వంలోని ఆప్ఘనిస్తాన్ సర్కార్ కు సాయం చేయాలా వద్దా అనే విషయంలో తీవ్ర మల్లగుల్లాలు పడిన భారత్.. తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో తాలిబన్లను ద్వేషించిన భారత్.. ఇప్పుడు వారిని ఆప్ఘన్ ప్రజల్ని కాపాడే వారిగా చూస్తోంది. తాజాగా తొలిసారి తాలిబన్లతో అధికారిక చర్చలు జరిపిన భారత్.. భారీ మానవతా సాయానికి హామీ ఇచ్చింది. ఆప్ఘన్ గడ్డపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతించరాదనే షరతుతో భారత్ ఈ సాయానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలి విడతలో 50 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల్ని వారికి పంపాలని భారత్ నిర్ణయించింది. అదీ ఐక్యరాజ్యసమితి ద్వారా ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది. తర్వాతి విడతలో మరింత సాయం చేయబోతోంది. ఇప్పటికే వ్యూహాత్మక భూభాగమైన ఆప్ఘనిస్తాన్ లో భారీ ఎత్తున మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేసిన భారత్.. ఈ సాయం ద్వారా ఆప్ఘన్ తో పాత బంధాలను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇదంతా తాలిబన్ల నుంచి ముప్పు లేనంతవరకే.












Click it and Unblock the Notifications