రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు షురూ: అజెండా ఇదే: ఉత్కంఠతతో ప్రపంచ దేశాలు
మిన్స్క్: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం అయిదో రోజుకు చేరుకుంది. యుద్ధం వల్ల ఇప్పటిదాకా 352 మంది పౌరులు మరణించారు. రాజధాని కీవ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న రష్యా సైన్యానికి అనూహ్యంగా ప్రతిఘటన ఎదురవుతోంది. కీవ్‌ను చుట్టుముట్టి మూడు రోజులు అవుతున్నప్పటికీ.. దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతోన్నాయి రష్యన్ బలగాలు. ఊహించని విధంగా ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితిని చవి చూస్తోన్నాయి.

ముప్పేటదాడిలో రష్యా..
అటు- ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సహా అంతర్జాతీయ వేదికల నుంచి రష్యా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ఆంక్షలతో సతమతమౌతోంది. యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా, కెనడా వంటి పలు దేశాలు రష్యాపై ఆర్థికంగా ముప్పేటదాడిని కొనసాగిస్తోన్నాయి. ఆంక్షలపై ఆంక్షలను విధిస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య డాలర్‌తో పోల్చుకుంటే రష్యన్ రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది. అటు మాస్కో స్టాక్ మార్కెట్‌లోనూ ట్రేడింగ్ స్తంభించిపోయింది.

బెలారస్‌లో ఓకే..
తొలుత నిరాకరించిన బెలారస్‌లోనే ముఖాముఖి సమావేశానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని మిన్స్క్‌లో కాకుండా మరో నగరాన్ని ప్రతిపాదించారు జెలెన్‌స్కీ. బెలారస్‌లోని గోమెల్‌లో సమావేశం కావాలని సూచించారు. దీనికి రష్యా కూడా అంగీకరించింది. ఫలితంగా- రెండు దేశాల ప్రతినిధుల బృందం బెలారస్‌కు బయలుదేరి వెళ్లాయి. అవి ఫలప్రదం అయితేనే యుద్ధం ముగిసినట్టవుతుంది.

బెలారస్‌లో చర్చలు షురూ..
ఈ పరిణామాల మధ్య రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్‌లోని గోమెల్- ఈ కీలక చర్చలకు వేదికగా మారింది. బెలారస్-ఉక్రెయిన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ గోమెల్ సిటీ. రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సిటీలో సమావేశం అయ్యారు. ముఖాముఖిగా భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది.

ఉక్రెయిన్ రక్షణ మంత్రి సారథ్యం..
ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్.. తన దేశం తరఫున హాజరైన ప్రతినిధులకు నాయకత్వాన్ని వహించారు. ఉక్రెయిన్ తరఫున 10 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. అంతే సంఖ్యలో రష్యా ప్రతినిధులు హాజరయ్యారు. వారితో పాటు రెండు దేశాలకు చెందిన పలువురు రక్షణ, విదేశీ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయిదు రోజులుగా కొనసాగుతోన్న భీకర యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనేదే ఈ చర్చల ఉద్దేశం.

అజెండా ఇదే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు నిలిపివేయడం.. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడం అనేది చర్చల ప్రధాన అజెండాగా విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా మొదలు పెట్టిన ఈ యుద్ధాన్ని రష్యానే మొదటగా విరమించాల్సి ఉంటుందనే వాదనలు ఉన్నాయి. తక్షణమే రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే- ఉక్రెయిన్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో- మొదటగా తాము కాల్పుల విరమణకు గానీ, భూభాగాన్ని గానీ అప్పగించడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్ చెబుతోంది. కాగా- నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరబోమనే హామీని ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. నాటోలో చేరడానికి ఉక్రెయిన్ సమాయాత్తం కావడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఈ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.

ఉత్కంఠతగా
ఈ చర్చల సారంశం, ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠతను రేపుతోంది. ఒకరకంగా చెప్పాలంటే- ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ప్రస్తుతం గోమెల్ చర్చల మీదే నిలిచాయి. మహాయుద్ధంగా, మూడో ప్రపంచ యుద్ధంగా మారడానికి సిద్ధంగా ఉన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు, దాడులు-ప్రతిదాడులకు బ్రేక్ పడాలంటే ఈ చర్చలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో- చర్చలు ఫలప్రదం కావాలంటూ అన్ని దేశాలు కూడా కోరుకుంటోన్నాయి.












Click it and Unblock the Notifications