విరుచుకుపడుతున్నఉక్రెయిన్: రష్యాపై మిస్సైళ్ల దాడి: పౌరులు బలి: డిఫెన్స్‌లో పడ్డ పుతిన్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత తీవ్రతరమౌతోంది. రెండు దేశాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. సై అంటే సై అంటోన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల సంపూర్ణ మద్దతుతో ఉక్రెయిన్- తనకంటే బలమైన రష్యాను ఢీ కొడుతోంది. సమవుజ్జీగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. రష్యా సైనిక బలగాల దాడులకు ధీటుగా స్పందిస్తోంది.

లొంగని ఉక్రెయిన్..
సరిహద్దుల్లోని కొన్ని నగరాలను చేజార్చుకున్నప్పటికీ- రాజధాని కీవ్‌ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోన్న కొద్దీ- రష్యా మరింత తన దాడుల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడమే ప్రస్తుతం రష్యా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకోగలిగితే- ఉక్రెయిన్‌పై పట్టు సాధించినట్టవుతుందని భావిస్తోంది. ఉక్రెయిన్ సైనిక బలగాల రక్షణ కవచాన్ని ఛేదించలేకపోతోంది.

ఆధిపత్యాన్ని సాధిస్తోందా?
ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కొంతవరకు ఆధిపత్యాన్ని సాధించినట్టు కనిపిస్తోంది. రష్యా వేర్పాటువాదులకు చెందిన డొనెట్స్క్ రీజియన్‌పై ఉక్రెయిన్ సైనిక బలగాలు మిస్సైళ్లతో విరుచుకుపడ్డారు. టోక్ఖా-యు క్షిపణులను సంధించాయి. డొనెట్స్క్‌లోని జనావాసాలపై ఈ మిస్సైళ్లను సంధించడం వల్ల 23 మంది సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. యుద్ధం ఆరంభమైన తరువాత తొలిసారిగా ఇంత భారీ ఎత్తున ఎదురుదాడికి దిగడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

ధృవీకరించిన రష్యా..
డొనెట్స్క్‌పై చోటు చేసుకున్న మిస్సైళ్ల దాడిని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెన్కోవ్ ప్రకటించారు. 28 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సోవియట్ మేడ్ టొక్ఖా-యు రకానికి చెందిన మిస్సైళ్లను ఉక్రెయిన్ సంధించిందని పేర్కొన్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

అతిపెద్ద ఎదురుదాడిగా..
ఈ ఘటనను ఉక్రెయిన్.. రష్యాపై చేసిన అతిపెద్ద ఎదురుదాడిగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రీజియన్.. డొనెట్స్క్. 2014 నుంచీ ఇది రష్యా వేర్పాటువాదుల ఆధీనంలో ఉంటోంది. యుద్ధం ఆరంభం కావడానికి రెండు-మూడు రోజుల ముందే డొనెట్స్క్‌ను ఇండిపెండెంట్ స్టేట్‌గా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. డొనెట్స్క్‌తో పాటు లుహాన్స్క్‌ను కూడా సర్వ స్వతంత్రంగా గుర్తిస్తున్నట్లు చెప్పారు.

జనావాసాలపై..
డొనెట్స్క్‌లో జనావాసాలపై మిస్సైళ్లను సంధించడాన్ని స్థానిక వేర్పాటువాదులు తప్పుపడుతున్నారు. ఉక్రెయిన్ తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ దాడిలో సాధారణ ప్రజలు దుర్మరణం పాలయ్యారని మండిపడుతున్నారు. ఏటీఎంల వద్ద బారులు తీరి నిల్చున్న స్థానిక ప్రజలు, బస్‌స్టాప్‌లో నిల్చున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సైనిక బలగాలు తమ మిస్సైళ్లను సంధించాయని ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications