యుక్రెయిన్‌లోకి రష్యా సైనిక బలగాలు.. డోనెస్క్, లూహాన్క్ ప్రాంతాల్లో ‘శాంతి పరిరక్షణ’కు పంపించిన పుతిన్

యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదిరిపోయింది. ఆ దేశంలోని తూర్పు భాగంలో.. యుక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను తాము 'స్వతంత్ర దేశాలు'గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాల్లో 2014 నుంచి యుక్రెయిన్ సైనిక బలగాలతో పోరాడుతున్నారు. తిరుగుబాటుదారులు తమ ప్రాంతాలను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ డోనెస్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ లుహాన్స్ పేరుతో స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో 'శాంతి పరిరక్షణ కార్యకలాపాలు’ నిర్వహించటానికి వెళ్లాలంటూ రష్యా సైనిక బలగాలను పుతిన్ ఆదేశించారు. దీంతో దౌత్య మార్గాల్లో సంక్షోభాన్ని పరిష్కరించే అవకాశాలు సన్నగిల్లాయి.
యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోకి రష్యా బలగాలు ప్రవేశించటానికి ఇది దారి ఇస్తుందని పశ్చిమ శక్తులు ఆందోళన చెందుతున్నాయి.
రష్యా సైనిక చర్య విస్తృతి ఎంత అనేది అస్పష్టంగానే ఉంది. కానీ సైనిక బలగాలు సరిహద్దు దాటినట్లయితే.. తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాలకు రష్యా సైనికులు అధికారికంగా ప్రవేశించటం ఇదే మొదటిసారి అవుతుంది.
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే
- ఫాల్స్ ఫ్లాగ్ అటాక్: ఏమిటీ వార్ ప్లాన్? యుక్రెయిన్‌పై దాడికి రష్యా వ్యూహం ఇదేనా?
యుక్రెయిన్ విషయంలో పుతిన్ ఏమన్నారు?
ఈ వేర్పాటు ప్రాంతాలతో ఒప్పందాలకు రష్యా పార్లమెంటు ఆమోదముద్ర వేయనుంది. తద్వారా డోనెస్క్, లుహాన్క్ ప్రాంతాల్లో రష్యా తన సైనిక స్థావరాలను నిర్మించుకునేందుకు హక్కు లభిస్తుంది.
ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజలకు పెద్ద సంఖ్యలో రష్యా పాస్‌పోర్టులు ఇచ్చారు. ఇప్పుడు తన పౌరులను రక్షించే మిషతో రష్యా తన సైనిక బలగాలను ఈ ప్రాంతాల్లోకి పంపిస్తుందని పశ్చిమ మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన పుతిన్.. ఆ తర్వాత గంట సేపు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ప్రసంగించారు.
యుక్రెయిన్ అనేది ''ప్రాచీన రష్యా భూమి’’ అంటూ.. ఆధునిక యుక్రెయిన్‌ను సోవియట్ రష్యా ''సృష్టించింది’’ అని చెప్పారు.
1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన సమయంలో రష్యాను ''దోపిడీ’’ చేశారన్నారు. యుక్రెయిన్‌ను కీలుబొమ్మ ప్రభుత్వం నడిపిస్తోందని, ఆ దేశం ''అమెరికా కాలనీ’’గా ఉందని ఆరోపించారు.
యుక్రెయిన్ ప్రస్తుత నాయకత్వం కింద ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. యుక్రెయిన్‌లో రష్యా అనుకూల నాయకుడిని కూలదోసిన 2014 నిరసనలు ఒక కుట్ర అని పుతిన్ అభివర్ణించారు.
- యుక్రెయిన్ సంక్షోభం: రష్యా సమాచార యుద్ధం చేస్తోందా
- యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు
''చీకటి సూచిక’’
పుతిన్ చర్యను అమెరికా తక్షణమే ఖండించింది. యుక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాల్లో అమెరికన్ల పెట్టుబడులను, వాణిజ్యాన్ని, నిధులు అందించటాన్ని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
యుక్రెయిన్ మీద రష్యా ఇంకా ముందుకెళ్లి దాడి చేస్తే పశ్చిమ దేశాలు విస్తృత ఆంక్షలు విధించటానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.
రష్యా చర్యలు.. యుక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను బాహాటంగా అతిక్రమించటమేనని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించటమేనని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మండిపడ్డారు. ''ఇది చాలా చీకటి సూచిక’’ అని ఆయన అభివర్ణించారు.
రష్యా మీద బ్రిటన్ కొత్త ఆంక్షలను మంగళవారం ప్రకటిస్తుందని విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ చెప్పారు.
యుక్రెయిన్‌తో సంఘీభావంగా తాము సమైక్యంగా, నిక్కచ్చిగా, దృఢచిత్తంతో ప్రతిస్పందిస్తామని యూరోపియన్ యూనియన్ ప్రతినబూనింది.
స్వతంత్రం ప్రకటించుకున్న యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో రష్యా బలగాలు శాంతిని కాపాడతాయనటం ''నాన్‌సెన్స్’’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అభివర్ణించారు. ''ఇది అవాంఛితం. అనుచితం’’ అన్నారాయన.
పుతిన్ చర్యతో యుక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రంగా ముదిరింది. ఆ దేశ సరిహద్దుల్లో 1,50,000 మందికి పైగా రష్యా సైనికులు చుట్టుముట్టి ఉన్నారు.
యుక్రెయిన్ మీద సైనిక దాడికి ప్రణాళిక రచిస్తున్నామనే వాదనను రష్యా తిరస్కరించింది. అయితే రష్యా దాడి చేసి తీరుతుందని అమెరికా నమ్ముతోంది.
మా సరిహద్దులు మారవు: యుక్రెయిన్ అధ్యక్షుడు
రష్యా చర్యలు.. యుక్రెయిన్ సార్వభౌమత్వం, సమగ్రతను అతిక్రమించటమేనని యుక్రెయిన్ అధ్యక్షుడు వాలోద్‌మిర్ జెలెన్స్కీ తప్పుపట్టారు. ఆయన మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు.
రష్యా ఎలాంటి ప్రకటనలు ఇచ్చినప్పటికీ.. యుక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దులు యధాతధంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. 'భయానకం. కానీ, ఇదే వాస్తవం’
- 1857 సిపాయిల తిరుగుబాటు: చపాతీలే బ్రిటిష్ పాలన అంతానికి నాంది పలికాయా?
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications