Saudi Arabia: ఉమ్రా యాత్రీకులకు గుడ్‌న్యూస్: 18 నెలల తరువాత
రియాద్: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు రోజులు, నెలల తరబడి మూతపడ్డాయి. వాటిని సందర్శించడానికి వచ్చే భక్తులు, పర్యాటకుల రూపంలో అందే ఆదాయాన్ని కోల్పోయాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నప్పటికీ.. వాటిని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాయి. విమాన సర్వీసులను రీఓపెన్ చేయడంతో పాటు పర్యాటకులు, తీర్థయాత్రీకులకు అనుమతి ఇవ్వడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో తమ దేశాల్లో పరిస్థితుల్లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా తమ విధానాలను కూడా మార్చుకుంటూ వస్తోన్నాయి.

ఉమ్రా యాత్రకు ఓకే..
ఇందులో భాగంగా- సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విదేశీ యాత్రీకులకు తీపికబురు అందించింది. ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మదీనాను సందర్శించడానికి ఉమ్రా (Umrah) యాత్రకు వెళ్లే విదేశీ భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. ఉమ్రా యాత్ర కోసం తమ దేశానికి వచ్చే ప్రతి విదేశీ భక్తుడు తప్పనిసరిగా వ్యాక్సినేటెడ్ అయి ఉండాలనే నిబంధనను విధించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని సూచించింది. దరఖాస్తులతో పాటు వ్యాక్సినేటెడ్ సర్టిఫికెట్లను కూడా అందజేయాల్సి ఉంటుందని సూచించింది.

ఫుల్లీ వ్యాక్సినేటెడ్.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిరూపించే డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాతే తుది అనుమతులను జారీ చేస్తామని స్పష్టం చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల మధ్య సౌదీ అరేబియా ప్రభుత్వం 18 నెలల కిందట విదేశీ యాత్రీకులు మదీనాను సందర్శించడాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ఈ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దాదాపు అన్ని దేశాలు కూడా అమలు చేస్తోన్నాయి. తమ దేశ పౌరులకు వ్యాక్సిన్లను అందజేస్తోన్నాయి.

తొలుత 60 వేల మందికి
ఈ నేపథ్యంలో- సౌదీ అరేబియా ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ యాత్రీకులు ఉమ్రా యాత్రకు రావడానికి అనుమతి ఇచ్చింది. ఉమ్రా యాత్ర కోసం అనుమతి కోరుతూ దరఖాస్తులను దాఖలు చేసే ప్రతి విదేశీ భక్తుడు కూడా ఆయా దేశాల ప్రభుత్వాలు జారీ చేసిన కెోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తొలి విడతలో ప్రతి నెల 60,000 మంది ఉమ్రా యాత్రికులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సౌదీ అరేబియా అధికారిక మీడియా తెలిపింది.
Recommended Video

12 బిలియన్ డాలర్ల ఆదాయం..
పరిస్థితులకు అనుగుణంగా ఈ సంఖ్యను క్రమంగా ప్రతి నెలా రెండు మిలియన్లకు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. దీనికి మరింత సమయం పట్టొచ్చని అభిప్రాయపడింది. కాగా- కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన ఆంక్షల వల్ల సౌదీ అరేబియా ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. సాధారణ రోజుల్లో మక్కా మదీనాను సందర్శించడానికి వచ్చే విదేశీ యాత్రీకుల వల్ల ఆ దేశ ప్రభుత్వానికి 12 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుండేది. ఆ ఆదాయం మొత్తాన్నీ కోల్పోయినట్టయింది.












Click it and Unblock the Notifications