UN సెక్రటరీ జనరల్‌గా గుటెరస్ కొనసాగింపునకు ఐరాస భద్రతా మండలి ఆమోదం, 10 మంది పోటీ పడినా..
ప్రపంచ శాంతి, భద్రత కోసం ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి(యూఎన్)కు సంబంధించి మరో కీలక నిర్ణయం వెలవడింది. ఐరాసకు చీఫ్ గా భావించే సెక్రటరీ జనరల్ పదవిలో ఆంటోనియో గుటెరస్ కొనసాగనున్నారు.
యూఎన్ సెక్రటరీ జనరల్ గా ఆయనను వరుసగా రెండోసారి కొనసాగించేందుకు యూఎన్ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం రహస్యంగా జరిగిన సమావేశంలో సభ్య దేశాలు ఏకగ్రీవంగా గుటెరస్ వైపే మొగ్గుచూపినట్లు మండలి ప్రస్తుత అధ్యక్షుడు, ఎస్టోనియా రాయబారి స్వెన్ జర్గెన్సన్ వెల్లడించారు. కాగా,

గుటెరస్ రెండోసారి సెక్రటరీ జనరల్ పదవిలో కొనసాగేందుకు సర్వప్రతినిధి సభ ఆమోదం తెలిపాల్సి ఉంది. అయితే, మండలి ఆమోదం లభిస్తే ప్రతినిధుల సభ అంగీకారం లాంఛనప్రాయమే. ఐరాస చీఫ్ పదవికి మరో 10 మంది పోటీ పడినప్పటికీ.. వారెవరికి ఐరాసలోని సభ్యదేశాల మద్దతు లేకపోవడం గమనార్హం. ఒక రకంగా గుటెరస్ ఎలాంటి పోటీ లేకుండానే రెండోసారి జనరల్ సెక్రటరీగా ఎన్నిక కానున్నారు.
గతంలో పోర్చుగల్ ప్రధానిగా చేసిన గుటెరస్ 2017లో ఐరాస బాధ్యతలు స్వీకరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష, జాతీయవాద మరియు విదేశాంగ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్న గుటెరస్ ఈసారి కరోనా, దాని మూలంగా ఉద్భవించిన వివిధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐరాస చీఫ్ ఎన్నికపై ప్రకటన వెలువడటానికి ముందురోజు..
ఐక్యరాజ్యసమితిలో సాదారణ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ బుధవారం ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. నాలుగింట మూడొంతుల ఓట్లతో విజయంసాధించారు. ఏటా జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్కో ప్రాంతానికి అవకాశం కల్పిస్తుంటారు. ఈసారి ఆసియా-పసిఫిక్ గ్రూప్ దేశాలకు అవకాశం దక్కగా, మాల్దీవులు దేశం తమ అభ్యర్థిగా అబ్దుల్ షాహిద్ ను ముందుంచగా, భారత్ సహా పలు దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి.షాహిద్ కు మద్దతుగా 143ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థిఅయిన అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి జాల్మియా రసూల్ కు కేవలం 48 ఓట్లు మాత్రమే దక్కాయి.












Click it and Unblock the Notifications