జెన్ జీ దెబ్బకు కుప్పకూలిన మరో ప్రభుత్వం..! పదేళ్ల పాలనకు ఎన్నికల్లో చరమగీతం..!
అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం, అధికార దుర్వినియోగం, అక్రమాలకు వ్యతిరేకంగా పలు దేశాల్లో జరుగుతున్న విద్యార్ధుల ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు వరుసగా కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ వంటి చోట్ల ప్రభుత్వాలను జెన్ జీ విద్యార్ధులే కుప్పకూల్చారు. ఈ రెండు దేశాల్లోనూ విద్యార్ధి నిరసనలు చోటు చేసుకోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు కుప్పకూలడం చూశాం. ఇప్పుడు ఐరోపా దేశమైన సెర్బియాలో (Serbia) అయితే ఏకంగా నిరసనలతో మొదలైన విద్యార్ధుల పోరు.. ఎన్నికల్లో పోటీ చేసి దశాబ్దకాలంగా పాలిస్తున్న నియంత సర్కార్ ను కుప్పకూల్చింది.
సెర్బియా పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర సంచలనం నమోదైంది. దాదాపు దశాబ్ద కాలంగా ఆ దేశ రాజకీయాలపై బలమైన ఆధిపత్యం చెలాయించిన అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. అక్కడ యువత, విద్యార్థుల మద్దతుతో బరిలోకి దిగిన 'స్టూడెంట్ లిస్ట్' కూటమి చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో తూర్పు ఐరోపా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాగా, సుదీర్ఘ కాలం పోరాడిన విద్యార్థులు ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

2024లో నోవి సాడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం కూల్చివేత ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోవడంతో సెర్బియాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి. పాలనలో పెరిగిపోయిన అవినీతి, పారదర్శకత లేకపోవడంపై యువత సుదీర్ఘకాలం నిరసనలు తెలిపింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 250 స్థానాలున్న పార్లమెంట్లో విద్యార్థుల కూటమి 135 నుంచి 140 స్థానాలు దక్కించుకోగా, వుచిచ్‌కు చెందిన సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ కేవలం 105 స్థానాలకే పరిమితమైంది. విద్యార్థుల ఈ అనూహ్య గెలుపు కేవలం సెర్బియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా యువజన శక్తులు సాధిస్తున్న పురోగతికి అద్దం పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే ఐరోపాలోని ఫ్రాన్స్, ఇటలీ, అల్బేనియా వంటి ఐరోపా దేశాల్లోనూ విద్యార్థులు విద్యా నిధుల కోత, పెరిగిన జీవన వ్యయం, పాలనాపరమైన అవినీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. ఇటలీలో పాఠశాల నిబంధనలపై, ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమిపై యువత తీవ్ర స్థాయిలో గళమెత్తింది.
భారత్ లోనూ నీట్ అక్రమాలు, ఆ తర్వాత ఎస్ఐఆర్, ఎన్నికల అక్రమాలపై విద్యార్దులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న తరుణంలో వెలువడిన ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














Click it and Unblock the Notifications
