యూఎస్ లో భారతీయుల వరుసహత్యలు.. ఆందోళనలో విద్యార్థులు; ప్రత్యేక భద్రతకు డిమాండ్!!
యూఎస్ వెళ్లి చదువుకోవాలని కలలు కన్న భారతీయులకు, అక్కడ అనేక యూనివర్సిటీలలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం దిన గండం నూరేళ్ళు ఆయుష్షులాగా పరిస్థితి మారింది. యూఎస్ లో ఉన్న గన్ కల్చర్ భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితిలో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుకునే భారతీయ విద్యార్థులకు అక్కడ భద్రత లేకపోవడం ప్రస్తుతం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తుంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయి. యూఎస్ లో ఉన్న విచ్చలవిడి గన్ కల్చర్ కారణంగా అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. మేరీ ల్యాండ్ బాల్టిమోర్ వంటి నగరాలలో క్రైమ్ రేటు విచ్చలవిడిగా కొనసాగుతోంది.

ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. భారత సంతతికి చెందిన శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందారు. మొన్నటికి మొన్న మిస్సోరి రాష్ట్రం క్యాన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పెరేడ్లో ఆగంతకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు.
భారత సంతతికి చెందిన హోటల్ యజమాని ప్రవీణ్ రావూజీ భాయ్ పటేల్ కస్టమర్ కాల్పులకు బలైన సంఘటన అమెరికా లోని అలబామ రాష్ట్రంలో జరిగింది. అమెరికాలో గన్ కల్చర్ మాస్ షూటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భారతీయ విద్యార్థులు మాల్ కి వెళ్లాలన్న, షాపింగ్ చేయాలన్న భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి.
అమెరికాలో జరుగుతున్న కాల్పులలో భారత విద్యార్థులు మృతి చెందితే సంతాపం తెలియజేయడం, దాడులను ఖండిస్తున్నామని చెప్పడం, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం తప్ప వైట్ హౌస్ ఈ విషయంలో మరే ఇతర సీరియస్ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో భారత విద్యార్థులకు ప్రత్యేక భద్రత కల్పించాలని అమెరికాలోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తుంది.
విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించాలని కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాలో నివాసముంటున్న భారతీయులు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు భారత్లో ఉన్న విద్యార్థుల కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు అంటున్నారు. మరి వైట్ హౌస్ ఈ భారతీయ సంతతిపై జరుగుతున్న దాడులకు ఏం కీలక నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి.












Click it and Unblock the Notifications