పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్- పలువురు ప్రయాణికులు దుర్మరణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తోన్నారు. చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా వెలికి తీసే పనుల్లో నిమగ్నం అయ్యారు.

కరాచి నుంచి రావల్పిండి మధ్య నడిచే హజారా ఎక్స్‌ప్రెస్ ఈ మధ్యాహ్నం పట్టాలు తప్పింది. కరాచి నుంచి బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ ఈ అర్ధరాత్రికి రావల్పిండికి చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 1,309 కిలోమీటర్లు. 18 గంటల సమయం పడుతుంది. కరాచి నుంచి బయలుదేరిన ఈ రైలు మార్గమధ్యలో షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య గల సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
షాజాద్‌పూర్ స్టేషన్‌ను దాటిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన సంభవించింది. 10 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగానికి చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మరణించినట్లు రేడియో పాకిస్తాన్ తెలిపింది. 50 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

ఈ ఘటనపై షహీద్ బెంజీరాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ యూనిస్ చాందీయో స్పందించారు. సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలను నవాబ్ షా నగరానికి పంపించినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టామని, మరణాల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తోన్నామని అన్నారు.
పాకిస్తాన్ ఫెడరల్ రైల్వే, ఏవియేషన్ మంత్రి ఖవాజా సాద రఫీక్ ఈ ఘటనపై మాట్లాడారు. లాహోర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం చోటు చేసుకున్న సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలు, సహాయక బృందాలు, సామాగ్రిని సంఘటన స్థలానికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications