అమెరికాలో మళ్లీ కాల్పులు: 14 మంది మృతి
శాన్‌బెర్నార్డినో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. 15 రోజుల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని సేవా కేంద్రంలోకి ముగ్గురు దొంగలు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 14 మంది మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.45 గంటలకు ఈ ఘటన జరిగింది. సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు దుండగులు వికలాంగుల సేవా కేంద్రంలో కాల్పులు జరిపిన నలుపు రంగు వాహనంలో పారిపోయారని, గాలింపు చర్యల్లో భాగంగా శాన్ బెర్నార్డినోలోని అన్ని ఇళ్లను తనిఖీ చేస్తున్నామని ఎఫ్‌బిఐ వర్గాలు చెప్పాయి.

సాయుధులు సేవా కేంద్రంలోకి వచ్చీరాగానే కాల్పులు ప్రారంభించారని, కొందరు బుల్లెట్ గాయాలతో నెలకొరిగారని, మరి కొందరు పక్క గదుల్లోకి వెళ్లి దాక్కున్నారని చెబుతున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల వద్ద కూడా భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలిపారు..
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను కనుక్కుంటూ సూచనలు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.
నవంబర్ 27వ తేదీన కాలిఫోర్నియా రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్ పట్టణంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారితో సహా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు ఓర్లియాన్స్ నగరంలోని ఓ పార్కులో ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు.












Click it and Unblock the Notifications