వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సినోఫార్మ్ టీకాను ఇప్పటికే కోట్ల మందికి ఇచ్చారు.

చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన కోవిడ్19 వ్యాక్సీన్‌ను అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.

అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలు కాకుండా, వేరే దేశం తయారుచేసిన కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించడం ఇదే మొదటిసారి.

సినోఫార్మ్ కోవిడ్19 టీకాను చైనాలో ఇప్పటికే కోట్ల మంది ప్రజలు వేయించుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు పీఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా తయారుచేసిన టీకాలకే ఆమోదం తెలిపింది.

అయితే వివిధ దేశాల్లోని ఆరోగ్య నియంత్రణ వ్యవస్థలు అత్యవసర పరిస్థితుల్లో సినోఫార్మ్ టీకాను వాడేందుకు గతంలోనే అనుమతి ఇచ్చాయి. ఈ జాబితాలో ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాల్లోని పేద దేశాలు ఉన్నాయి.

ప్రారంభ దశలో చైనా వ్యాక్సీన్ల డేటా అంతర్జాతీయంగా విడుదల కాకపోవడంతో వాటి సామర్థ్యంపై చాలా కాలంగా అనిశ్చితి ఉంది.

సినోఫార్మ్ టీకా భద్రత, సమర్థత, నాణ్యతలను తాము ధ్రువీకరించామని డబ్ల్యూహెచ్‌వో మే 7న ప్రకటించింది.

ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న ప్రజలకు టీకాతో రక్షణ కల్పించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించింది. సినోఫార్మ్ టీకాకు తమ ఆమోదంతో ఆయా దేశాలు టీకా సేకరణను వేగవంతం చేసేందుకు అవకాశముందని చెప్పింది.

18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారికి రెండు డోసులుగా ఈ టీకాను ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. సినోవాక్ అనే మరో చైనా కంపెనీ తయారుచేసిన వ్యాక్సీన్‌పై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశముంది. టీకాకు సంబంధించి ప్రస్తుతం అదనపు సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

సినోవాక్ టీకాను ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించిన అనేక దేశాలకు ఇప్పటికే కోట్ల డోసుల్లో ఎగుమతి చేశారు.

రష్యా టీకా స్ఫుత్నిక్‌ పనితీరు, నాణ్యతలపై ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో మదింపు జరుపుతోంది.

కంబోడియాలో సినోఫామ్ టీకా వేయించుకొంటున్న ఒక మహిళ

డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ప్రాధాన్యం ఏమిటి?

ఏదైనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపితే టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది అని నిర్ధరించినట్లు అవుతుంది. అది వివిధ దేశాల్లోని జాతీయస్థాయి నియంత్రణ వ్యవస్థలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.

టీకాకు జాతీయస్థాయిలో ఆమోదం తెలిపే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం నమ్మకాన్ని కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్‌ గెబ్రియేసస్‌ చెప్పారు.

డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన టీకాను 'కోవాక్స్' అంతర్జాతీయ పథకంలోనూ ఉపయోగించవచ్చు. టీకా లభ్యతలో పేద, ధనిక దేశాలకు సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఈ పథకాన్ని 2020లో ప్రారంభించారు.

సేకరణ, సరఫరాలో సమస్యలతో ఈ పథకం అవరోధాలను ఎదుర్కొంటోంది. అత్యవసర పరిస్థితుల్లో చైనా టీకా వినియోగానికి ఆమోదంతో ఈ సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశముంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదానికి ముందు నుంచే సినోఫార్మ్ టీకాను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం సుమారు ఆరున్నర కోట్ల డోసులను ఇప్పటికే వేశారు.

చైనాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, మధ్య ఐరోపా దేశమైన హంగేరీలలో సినోఫార్మ్ టీకాను ఇంతకుముందు నుంచే వేస్తున్నారు.

సినోఫార్మ్ టీకా క్లినికల్ డేటాను, ఉత్పత్తి విధానాలను డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా బృందం పరిశీలించి, దీనిని ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించాలనే నిర్ణయం తీసుకొంది.

కోవిడ్ లక్షణాలున్న, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న కేసుల్లో సినోఫార్మ్ టీకా సామర్థ్యం (ఎఫికసీ) 79 శాతంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

క్లినికల్ ట్రయల్స్‌లో 60 ఏళ్లు పైబడినవారిని చేర్చలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రస్తావించింది. అందువల్ల ఆ వయసు వారిలో టీకా ఎంత మేర పనిచేస్తుందనేది అంచనా వేయలేకపోయామని చెప్పింది. అయితే ఈ టీకా పనితీరు మిగతావారితో పోలిస్తే వయసు పైబడినవారిలో భిన్నంగా ఉంటుందనేందుకు ప్రాతిపదిక ఏమీ లేదని వ్యాఖ్యానించింది.

అస్ట్రాజెనెకా వ్యాక్సీన్ లాంటి టీకాల మాదిరి చైనా టీకాలను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య స్టాండర్డ్ రిఫ్రిజరేటర్‌లో నిల్వ ఉంచవచ్చు. ఇది చైనా టీకాలతో ఉన్న ఒక ముఖ్యమైన వెసులుబాటు. టీకా నిల్వ సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో సినోఫార్మ్ టీకా ఎంతో అనువైనదని డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యానించింది.

గ్రాఫిక్

ఈ రెండు చైనా టీకాలు ఎలా పనిచేస్తాయి?

ప్రస్తుతం వినియోగంలో ఉన్న పీఫైజర్, మోడెర్నా లాంటి టీకాలతో పోలిస్తే చైనా టీకాలు భిన్నమైనవి. వీటిని ఎక్కువగా సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేశారు. వీటిని ఇనాక్టివేటెడ్ వ్యాక్సీన్స్ అని కూడా పిలుస్తారు. ఈ టీకాల్లో మృత వైరల్ పార్టికల్స్‌ వాడతారు. టీకాతో ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దీనిని అసలైన వైరస్ దాడిగానే భావించి మన రోగ నిరోధక వ్యవస్థ తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది.

బయోఎన్‌టెక్/పీఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు. కరోనావైరస్ జెనెటిక్ కోడ్‌లో కొంత భాగాన్ని టీకాతో మన శరీరంలోకి చొప్పిస్తారు. దానిని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థ అలవాటు పడుతుంది. అదే క్రమంలో కరోనావైరస్‌పైనా పోరాడుతుంది.

అస్ట్రాజెనెకా టీకా మరో రకం వ్యాక్సీన్. చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్‌లోని ఒక వర్షన్‌, కరోనావైరస్‌ జెనెటిక్ మెటీరియల్‌ను ఆధారంగా చేసుకొని ఈ టీకా తయారు చేస్తారు.

చింపాంజీల నుంచి జలుబుకు కారణమయ్యే వైరస్‌ను సేకరించాక మనుషుల్లో పెరగడానికి వీలు లేకుండా దీనిలో జన్యుపరమైన మార్పులు చేస్తారు. తర్వాత ఈ వైరస్‌కు కోవిడ్19 వైరస్‌ నుంచి ప్రొటీన్లు తయారుచేసుకోగలిగే జన్యువులను కలుపుతారు.

శరీరంలోకి నిజమైన కరోనావైరస్‌ వచ్చినప్పుడు దానిపై పోరాడేలా ఇమ్యూనిటీ వ్యవస్థకు ఈ వ్యాక్సీన్ శిక్షణ ఇస్తుంది.

అస్ట్రాజెనెకా టీకా సామర్థ్యం దాదాపు 76 శాతంగా ఉంది. బయోఎన్‌టెక్/పీఫైజర్, మోడెర్నా టీకాల సామర్థ్యం దాదాపు 90 శాతం, అంతకంటే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

చైనా కోవిడ్ టీకాల సామర్థ్యం తక్కువగా ఉందని కొన్ని వారాల కిందట 'చైనీస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' సారథి గావో ఫు వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తర్వాత చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sinopharm: WHO approves emergency use of China vaccine, distributed to millions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X