శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత - ఆర్ద్రరాత్రి ప్రకటన : అల్లాడుతున్న ప్రజానీకం..!!
శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేసారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అర్ద్రరాత్రి ప్రకటన చేసారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. అధ్యక్షుడు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో..ఏప్రిల్ 1 న విధించిన అత్యవసర పరిస్థితిని మంగళవారం అర్ద్రరాత్రి ఎత్తివేసారు.
కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాలు, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. దిగుమతులు నిలిచిపోవడంతో శ్రీలంకలో తీవ్ర ఔషధాల కొరత ఏర్పడింది. శ్రీలంకలో మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. ఆర్థిక సమస్యల రీత్యా నార్వే, ఇరాక్, ఆస్ట్రేలియాలోని దౌత్య కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో అధ్యక్షుడి పాలనా వ్యవస్థకు స్వస్తి పలుకాల్సిన అవసరమున్నదని విపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస పేర్కొన్నారు.

దేశంలో కొత్త ఎన్నికల వ్యవస్థ రావాలని చెప్పారు. ఇప్పటికే ప్రధాని మినహా మిగిలిన శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసింది. విపక్షంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగాయి. ఈ సమయంలో ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలతో వారిని సమాధాన పర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో.. భారత్ వంటి దేశాల సాయం కోసం శ్రీలంక నేతలు అభ్యర్ధిస్తున్నారు. భారత్ ఇప్పటికే శ్రీలంకకు పలు రకాలుగా సాయం ప్రకటించింది. ఇక, ఇప్పుడు అత్యవసర పరిస్థితులు ఎత్తివేయటం తో రాజకీయంగా మార్పులకు అవకాశం ఏర్పడుతోంది. దీంతో..శ్రీలంకలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications