శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు.. రాజపక్సేకు వ్యతిరేకంగా ఆందోళనలు.. సోషల్ మీడియాపై నిషేధం.!
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత వెంటాడుతోంది. ఆహార సంక్షోభంతో .. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డిజిల్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఏ వస్తువు కొనాలన్నా ప్రజలు.. కిలోమీటర్ల కొద్ది క్యూలో నిల్చుంటున్నారు. ప్రతి రోజూ 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క జనం ఆకలితో అలమటిస్తున్నారు. దీందో ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోయింది.

శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం..
ధరలు భారీగా పెరగడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనం రోడ్లపైకి వచ్చి నిరసలకు దిగడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఛార్జీ జరిపారు. టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దేశ వ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఎవరైనా రోడ్లపై కనిపిస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు తప్పవని ఆదేశాలు జారీ చేసింది.

సోషల్ మీడియాపై ఆంక్షలు
మరో వైపు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. వాట్సప్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు ఆదివారం నుంచి సోషల్ మీడియాపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈమేరకు రాజపక్సే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ఆందోళనలను కొంతవరకు అణిచివేయవచ్చని భావిస్తోంది. అటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతుంది.

శ్రీలంకకు భారత్ చేయూత
ఆర్థిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్ చేయూతను అందించింది. శ్రీలంకకు అవసరమైన సహయాన్ని అందిస్తోంది. తాజాగా మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. గత 50 రోజుల్లో సుమారు 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసింది. ఇప్పటి వరకు శ్రీలంకకు నాగుగు సార్లు డీజిల్ పంపించింది. అటు శ్రీలంక నుంచి వలస వస్తున్న వారిని ఆశ్రయం కల్పిస్తోంది. దీనిపై ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా చర్చించారు.












Click it and Unblock the Notifications