ఎన్ఎస్‌జీ కమాండోల సహకారం అక్కర్లేదు... మా తిప్పలు మేం పడుతాం: రాజపక్సే
కొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్‌ను ఉద్దేశించి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే అన్నారు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ఎన్ఐఏ ముందుగానే సమాచారం అందించినప్పటికీ ఎవరికి వారు నిర్లక్ష్యం వహించారు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలోనే మహిదా రాజపక్సే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు సంబంధించిన విచారణ సంస్థలు తమ భూభాగంపై అడుగుపెట్టకూడదని చెప్పారు. ఒకవేళ అడుగుపెడితే వారికి తమ దేశానికి సంబంధించిన అధికారులు అప్పజెప్పాల్సి ఉంటుందని అన్నారు.

శ్రీలంక సహాయం కోరితే బలగాలను సిద్ధంగా ఉంచినట్లు భారత అధికారి ఒకరు ప్రకటించడంతో మహిందా రాజపక్సే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలపై మహిదా రాజపక్సే నిప్పులు చెరిగారు. సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు అలసత్వం వహించారని ఆయన ప్రశ్నించారు. దేశ భద్రతను గాలికొదిలేసి ఇద్దరూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీలంకలో అతివాదం పెరిగిపోతోందని ప్రతిఒక్కరికి తెలుసని అయినప్పటికీ ఓట్టు ఓటుబ్యాంకే పరమావధిగా ఇద్దరూ వ్యవహరించారని ధ్వజమెత్తారు మహిందా రాజపక్సే.
ఇదిలా ఉంటే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ ఏడాది అక్టోబర్ డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సిరిసేన, విక్రమసింఘేలు లక్ష్యంగా మహిందా రాజపక్సే విమర్శలు గుప్పించారు. తన హయాంలో శాంతికోసం తమిళ టైగర్ వేర్పాటు వాదులను అణిచివేసినట్లు గుర్తు చేసిన మహిందా రాజపక్సే... ఇప్పుడు సిరిసేన, రణిల్ విక్రమసింఘేలు దాన్ని మెయింటెయిన్ చేయడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. అయితే ఈ సారి మహిందా రాజపక్సే అధ్యక్ష పదవికి పోటీ చేయలేకపోయినప్పటికీ అతని సోదరుడు గొటబయ అధ్యక్ష పదవికి బరిలో నిలుస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications