ఊబిలో కూరుకుపోయిన హిండెన్‌బర్గ్- సాక్ష్యాలు దొరుకుతున్నాయ్
వివాదాస్పద షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ చిక్కుల్లో కూరకుపోతున్నారు. హిండెన్‌బర్గ్, అండర్సన్‌కు వ్యతిరేకంగా కెనడాలోని ఒంటారియో న్యాయస్థానం కొనసాగుతున్న విచారణ సందర్భంగా కీలకమైన ఆధారాలు బహిర్గతమౌతోన్నాయి.
హిండెన్‌బర్గ్‌కు ఉన్న రహస్య ఒప్పందాలు, అండర్సన్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తోన్న సెక్యూరిటీ మోసాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. అటు ఆండర్సన్, ఇటు యాన్సన్ ఫండ్స్ అనేక సెక్యూరిటీ మోసాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లభిస్తోన్నాయని కెనడాకు చెందిన ఆన్‌లైన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ అవుట్‌లెట్ మార్కెట్‌ఫ్రాడ్స్ తెలిపింది. ఇప్పటికి వీటిలో అయిదు శాతం మాత్రమే వెలుగు చూశాయని పేర్కొంది.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశాలను జారీ చేస్తే- ఇదే ఏడాది హిండెన్‌బర్గ్, యాన్సన్ ఫండ్స్‌కు సంబంధించిన మోసాలపై అభియోగాలు ఖరారవుతాయనడంలో సందేహాలు అక్కర్లేదని మార్కెట్‌ఫ్రాడ్స్ న్యూస్ అవుట్‌లెట్ వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేవలం మూడు రోజుల ముందు హిండెన్‌బర్గ్ మూతపడటం, పైగా మూడే రోజుల్లో ఆ సంస్థ తన కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బ్లూమ్‌బర్గ్ క్రాక్ పరిశోధక బృందం నవంబర్ 2024లో తొలిసారిగా హిండెన్‌బర్గ్ సహా వివిధ షార్ట్ సెల్లర్లపై విస్తృతమైన నివేదికను బయటపెట్టిన విషయం తెలిసిందే. షార్ట్-సెల్లర్స్ సీక్రెట్ టాక్స్ అండ్ అలయన్స్ ఎమర్జ్ ఇన్ కోర్ట్ బాటిల్ అనే సిరీస్ కింద వరుసబెట్టి కథనాలను ప్రచురించింది. ఆయా సంస్థల వెనుక ఉన్న రహస్య శక్తులను బహిర్గతం చేసింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్, యాన్సన్ ఫండ్స్ సహా వివిధ షార్ట్ సెల్లర్ సంస్థల సెక్యూరిటీ మోసాలపై కేంద్రీకృతమైన రిపోర్ట్ ఇది. భారత సంతతికి చెందిన మోయెజ్ కస్సామ్ నిర్వహిస్తోన్న కెనడా ఆధారిత ఫండింగ్ కంపెనీ యాన్సన్ ఫండ్స్.
యాన్సన్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ హిండెన్‌బర్గ్ గతంలోనే తోసిపుచ్చింది. బ్లూమ్‌బర్గ్‌కూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి వందల కొద్దీ లీడ్స్ తమకు అందుతుంటాయని, వాటన్నింటినీ తాము లోతుగా పరిశీలిస్తుంటామని వివరణ ఇచ్చింది. స్వతంత్రంగా వ్యవహరిస్తుంటామని పేర్కొంది.
ఆండర్సన్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. యాన్సన్ లేదా ఇతర సంస్థలతో భాగస్వామ్యం ఉందంటూ వచ్చిన వార్తలను బహిరంగంగా ఖండించారు. లీక్ అయిన ఇమెయిల్ సారాంశం మాత్రంం దీనికి పూర్తి భిన్నం. 2019లో హిండెన్‌బర్గ్- యాన్సన్‌కు చెందిన సంజీవ్ పూరి మధ్య ఓ డజన్ల కొద్దీ ఇమెయిల్స్ సాగాయి.
కాగా- తమకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న షార్ట్ సెల్లర్‌ను ఎదుర్కొనడానికి గత ఏడాది విదేశీ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యులతో కలిసి అదాని గ్రూప్ రహస్యంగా పరిశోధనలు ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2023 జనవరిలో తొలిసారిగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌పై తన నివేదికను విడుదల చేసింది. దీనివల్ల అదాని సంస్థ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.
అదానీ గ్రూప్‌పై కొనసాగిన దాడుల్లో యాన్సన్ పాత్ర ఇంకా అస్పష్టంగా ఉంటోంది. ఆ సంస్థకు అండగా ఉంటోన్న వాళ్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ రికార్డును కలిగి ఉన్నారంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. యాన్సన్ వ్యవస్థాపకుడి భార్య మరిస్సా సీగల్ కస్సామ్, మహువా మోయిత్రా జేపీ మోర్గాన్‌లో సహచరులుగా ఉన్నారు.
జేపీ మోర్గాన్‌లో మహువా మొయిత్రా దాదాపు 12 ఏళ్లు పనిచేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక బయటికొచ్చిన తరువాత లోక్‌సభలో అదానీ గ్రూప్‌పై నేరుగా దాడులకు శ్రీకారం చుట్టిన వారిలో మహువా మొయిత్రా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications