కెనడాలో భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దారుణ హత్య
ఒట్టావా: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకుంటోన్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన తాలూకు దుమారం ఇంకా తగ్గట్లేదు.
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ.

జస్టిన్ ట్రూడో చేసిన ఈ ప్రకటన.. తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. దీన్ని భారత్ తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ట్రూడో చేసిన ప్రకటనతో తాము విభేదిస్తోన్నామని స్పష్టం చేసింది. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటో తమకు తెలియదని పేర్కొంది. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లను జారీ చేసింది. సమగ్ర వివరణ కోరింది.
అక్కడితో ఆగలేదు కేంద్ర ప్రభుత్వం. కెనడాలో నివసించే భారతీయులు, విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలో- అక్కడ నివసించే తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడా వెళ్లే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ పరిణామాల మధ్య- కెనడాలో మరో దిగ్భ్రాంతికర ఘటన చేసుకుంది. పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దూర్ సింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ డల్లాకు అతను కుడిభుజం. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. జాతీయ దర్యాప్తు సంస్థ వాంటెడ్ లిస్ట్‌లో సుఖ్‌దూర్ సింగ్ పేరు ఉంది.
భారత భద్రతాధికారులు, విమానాశ్రయం సిబ్బంది కళ్లుగప్పి 2017లో కెనడాకు పారిపోయాడు సుఖ్‌దూర్ సింగ్. దీనికోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను వినియోగించాడు. పంజాబ్‌లోని మోగా జిల్లా అతని స్వస్థలం. దవీందర్ బంబిహా గ్యాంగ్‌లో సుదీర్ఘకాలం కొనసాగాడు. కీలక సభ్యుడిగా ఎదిగాడు.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో చేర్చిన తరువాత కెనడాకు పారిపోయాడు. ఆరు సంవత్సరాలుగా విన్నిపెగ్ సిటీలో నివసిస్తోన్నాడు. భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున విన్నీపెగ్ సిటీలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో సుఖ్‌దూర్ సింగ్ హతం అయ్యాడు.












Click it and Unblock the Notifications