పాకిస్తాన్‌లో నరమేథం: మసీదులో ప్రార్థనల వేళ: అంతకంతకూ మృతుల సంఖ్య..!!
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. పెషావర్ లోని ఓ మసీదుపై ఆత్మాహూతి దళ సభ్యుడు చేసిన దాడిలో పలువురు మృత్యువాత పడ్డారు. అనేకమంది గాయపడ్డారు.
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని నుంచి బయటపడలేక విలవిల్లాడుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిందా దేశం. ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ధాన్యాలు, నిత్యావసర సరుకులను తీసుకెళ్లే లారీలు, భారీ ట్రక్కులపై స్థానికులు దాడులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది.
మసీదుపై దాడి..
ఈ పరిణామాల మధ్య.. ఉగ్రవాదులు పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పెషావర్ లోని మసీదుపై ఆత్మాహూతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించారు. 100 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రారంభంలో ఇద్దరు మరణించినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత ఈ సంఖ్య 18కి పెరిగింది. అక్కడితో ఆగబోదనే అంచనాలు ఉన్నాయి. గాయపడ్డ వారిలో పోలీసులు కూడా ఉన్నారు.
ఆత్మాహూతి దాడి..
పెషావర్ లోని పోలీస్ లైన్స్ ఏరియాలో గల మసీదులో ఈ మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి చోటు చేుకుంది. జొవర్ ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడొకడు తనను తాను పేల్చుకున్నాడు. ఆ సమయంలో అతను కూడా ప్రార్థనల్లోనే ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తరువాత తుపాకీ కాల్పులు కూడా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.
శిథిలాల మధ్య..
పేలుడు ధాటికి మసీదు భవనంలో కొంత భాగం కుప్పకూలింది. భవన శిథిలాల కింద కూడా పలువురు చిక్కుకుని ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని పోలీసులు, స్థానికులు రక్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. రక్తమోడుతున్న వారిని చేతులు, భుజాలపై వేసుకుని అంబులెన్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. సమీపంలోనే ఉన్న లేడీ రీడింగ్ ఆసుపత్రికి వారిని తరలించారు.

120 మందికి పైగా..
పేలుడు సంభవించిన సమయంలో మసీదులో 120 మందికి పైగా ప్రార్థనలు చేస్తోన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఉద్దేశపూరకంగా జరిగిన దాడిగా నిర్ధారించినట్లు పెషావర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సాధారణంగా పోలీస్ లైన్స్ ప్రాంతంలో భద్రత అధికంగా ఉంటుందని, ఇది వీఐపీ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున తనిఖీలను నిర్వహించిన తరువాతే మసీదులోకి అనుమతిస్తుంటారని అన్నారు.

రెడ్ అలర్ట్..
ఈ ఘటన తరువాత నగరంలో రెడ్ అలర్ట్ ను జారీ చేసినట్లు ఇస్లామాబాద్ పోలీస్ న్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ అక్బర్ నాసిర్ ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేపిటల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని చెప్పారు. నగరంలోని అన్ని రహదారులను మూసివేశామని, ఎంట్రీ- ఎగ్జిట్ పాయింట్ల వద్ద గస్తీని ముమ్మరం చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications