ఆఫ్గనిస్తాన్‌లో మొదలైన తాలిబన్ల ఫత్వాలు... కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తూ మొదటి ఫత్వా...
అనుకున్నదంతా జరుగుతోంది... ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు... శనివారం(ఆగస్టు 18) తాలిబన్ల నుంచి మొదటి ఫత్వా జారీ అయింది. ఇకపై ప్రభుత్వ,ప్రైవేట్ యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. సమాజంలోని అన్ని రుగ్మతలకు మూలం కోఎడ్యుకేషన్‌లోనే ఉందన్నారు.ఇప్పటికైతే హెరాత్ ప్రావిన్స్‌లో మాత్రమే ఈ నిషేధాన్ని ప్రకటించారు.
Recommended Video
హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు,ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలతో శనివారం తాలిబన్ అధికారులు సమావేశమై కోఎడ్యుకేషన్‌పై చర్చించారు. సమావేశ అనంతరం కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల విధానాలు మొదటి నుంచి విద్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీలకు విద్య,ఉద్యోగాలను మొదటి నుంచి వారు నిరాకరిస్తున్నారు.

1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు హక్కులే లేకుండా పోయాయి. వారికి విద్య,ఉద్యోగాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇంటి గడప దాటాలంటే మగ తోడు ఉండాల్సిందేనని... అది కూడా కుటుంబ సభ్యులే అయి ఉండాలని ఆంక్షలు పెట్టారు. బలవంతంగా వారికి తాలిబన్ ఫైటర్లతో పెళ్లిళ్లు జరిపించేవారు. స్త్రీ అంటే కేవలం సంతానం కోసమే అనే భావన వారిలో నాటుకుపోయింది.
2001లో తాలిబన్ల పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకూ మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువు బాట పట్టారు. తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోనూ రాణించారు. కానీ ఇప్పుడు దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టినట్లయింది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గనిస్తాన్‌లో స్త్రీల హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నిజానికి ఇటీవలి తాలిబన్ల మొదటి ప్రెస్‌మీట్‌లో వారి మాటలు కాస్త ఉదారంగా అనిపించాయి. స్త్రీలకు విద్య,ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కొనసాగుతాయని వారు ప్రకటించారు. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులకు గౌరవం,భద్రత కల్పిస్తామన్నారు. కానీ కొద్దిరోజులకే వారి అసలు రంగు బయటపడుతోంది. ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ఇస్లామిక్ చట్టాలకు లోబడే వ్యవస్థలు,వ్యక్తులు నడుచుకోవాలని తాలిబన్లు హుకుం జారీ చేస్తున్నారు.
అవకాశం దొరికితే ఆఫ్గనిస్తాన్ నుంచి బయటపడేందుకే ఎంతోమంది ఆఫ్గన్లు ఎదురుచూస్తున్నారు. కానీ అది అసాధ్యమనే చెప్పాలి. ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారత్,అమెరికా పౌరులను సొంత దేశాలకు తిరిగి తరలించడమే అత్యంత సంక్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్గన్ దేశస్తులకు శరణార్థులుగా ఏ దేశం ఆశ్రయం కల్పించే సూచనలు కనిపించట్లేదు. ఆఫ్గనిస్తాన్ విముక్తి పోరాటాన్ని ఆఫ్గనిస్తాన్ ప్రజలే నడపాలని జో బైడెన్ ఇప్పటికే చెప్పేశారు. తమది కాదని యుద్ధంలో ఇక సైనికులను కోల్పోదలుచుకోలేదని ఇటీవల ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్ నుంచి సైన్యం ఉపసంహరణను ఆయన సమర్థించుకున్నారు. దీంతో ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూడకుండా... ఆఫ్గన్లే తమ విముక్తి పోరాటాన్ని నడపాల్సిన అనివార్యత నెలకొంది.












Click it and Unblock the Notifications