భారత్‌కు తాలిబన్ల వార్నింగ్-ఆఫ్గన్ ప్రజలపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ-ఇక ఆ విమానాలన్నీ తాలిబన్ల చేతికే?
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణ తర్వాత తాలిబన్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అమెరికాకు చెందిన చివరి కార్గో విమానం గాల్లో ఎగరగానే సంబరాలు మొదలుపెట్టారు.నిన్నటి దాకా అమెరికా ఆధీనంలో ఉన్న కాబూల్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టి... అంతటా కలియదిరిగారు. విమానాశ్రయంలోని హంగర్‌లో అమెరికా వదిలి వెళ్లిన చాపర్స్,సాయుధ వాహనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తాలిబన్లు... 'ఈ విజయం ఆఫ్గన్లందరిదీ' అని ప్రకటించారు. అదే సమయంలో తాలిబన్లు భారత్‌కు ఓ హెచ్చరిక జారీ చేశారు.

ఆఫ్గన్ ప్రజలు ప్రేమ,సానుభూతికి అర్హులు : తాలిబన్
తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. అమెరికాతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటితోనూ దౌత్య సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. 'తాము విజయం సాధించిన ఈ సంతోషకర సమయంలో ప్రపంచం తప్పక పాఠం నేర్చుకోవాలి.' అని అభిప్రాయపడ్డారు. మరోసారి తమ దేశం ఆక్రమణకు గురికావొద్దని కోరుకుంటున్నామని... శాంతి,ఆఫ్గన్ ప్రజల శ్రేయస్సు,నిజమైన ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించడమే తమ ఉద్దేశమని తెలిపారు.'ఆఫ్గన్ ప్రజల విషయంలో తాలిబన్లు శ్రద్ద వహించాలి. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ చాలా ఆటుపోట్లకు గురైంది.ఆఫ్గన్ ప్రజలు ప్రేమకు,సానుభూతికి అర్హులు.కాబట్టి వారి పట్ల సున్నితంగా ఉండండి.మనం వారి సేవకులం.మనం వాళ్లపై రుద్దబడకూడదు.' అని జబీహుల్లా తాలిబన్లకు హితవు పలికారు.

భారత్‌కు తాలిబన్ వార్నింగ్
ప్రపంచ దేశాలన్నింటితోనూ దౌత్యపరమైన సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పిన తాలిబన్లు... భారత్,పాకిస్తాన్‌లకు హెచ్చరిక జారీ చేశారు. తాలిబన్ విదేశీ వ్యవహారల చీఫ్ షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జయ్ మాట్లాడుతూ... భారత్-పాక్ అంతర్గత గొడవలోకి తమను లాగవద్దని అన్నారు. రెండు దేశాల మధ్య గొడవల్లో ఆఫ్గనిస్తాన్ పేరు తీసుకురావొద్దని హెచ్చరించారు.భారత్ పట్ల తాలిబన్లు శత్రువుల్లా వ్యవహరించబోతున్నారా అని మీడియా ప్రశ్నించగా... ఆయన దాన్ని ఖండించారు. ఈ విషయంలో మీడియా ఎప్పుడూ తప్పేనని అన్నారు.'భారత్-పాక్ దేశాలకు సుదీర్ఘమై సరిహద్దు ఉంది.సరిహద్దులో వాళ్లలో వారు తలపడగలరు.అయితే ఇందుకోసం వారు ఆఫ్గనిస్తాన్‌ను ఉపయోగించుకోవద్దు. రెండు దేశాలు తమ అంతర్గత గొడవ కోసం ఆఫ్గనిస్తాన్‌ను ఉపయోగించుకోవని ఆశిస్తున్నాం. పొరుగు దేశాలతో మేము సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు.

ఆ విమానాలన్నీ తాలిబన్ చేతికి...
అమెరికా నిష్క్రమణ తర్వాత కాబూల్ విమానాశ్రయం కూడా తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తాలిబన్లు అంతటా కలియదిరిగారు. జబీహుల్లా సహచర తాలిబన్లతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ రన్ వేపై కలియదిరుగుతున్న వీడియో ట్విట్టర్‌లో వెలుగుచూసింది. విమానాశ్రయం హంగర్‌లోకి వెళ్లి అమెరికా వదిలి వెళ్లిన హెలికాప్టర్లు,విమానాలు,సాయుధ వాహనాలను తాలిబన్లు పరిశీలించారు. హంగర్‌లో నాలుగు చినూక్ హెలికాప్టర్లు,హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్,పలు సాయుధ వాహనాలు ఉన్నాయి. అయితే కాబూల్‌ను వీడే ముందు.. అమెరికా సైన్యం వీటన్నింటినీ డీయాక్టివేట్ చేసినట్లు చెబుతున్నారు.

వాటిని డీయాక్టివేట్ చేసిన అమెరికా
అమెరికా రక్షణ విభాగానికి చెందిన సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ... కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అమెరికా వదలి వచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్స్ నిరుపయోగమని పేర్కొన్నారు. అమెరికా సైన్యం వాటిని నిరుపయోగంగా మార్చేసిందని చెప్పారు. వాటిని ఇక ఎవరూ ఆపరేట్ చేయలేరని... అవి గాల్లోకి ఎగరలేవని తెలిపారు. కాబూల్‌ను వీడే చివరి నిమిషం వరకూ అమెరికా వీటిని ఉపయోగించింది. ఆగస్టు 31 డెడ్ లైన్‌కు ఒక రోజు ముందే తమ సైనిక బలగాలను కాబూల్ నుంచి తరలించేసింది. ఇప్పటికీ కొంతమంది అమెరికన్లు అక్కడే చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. ఇతర దేశస్తులు,దేశం వీడాలనుకునే ఆఫ్గన్లు ఇప్పటికీ కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దే పడిగాపులు కాస్తున్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

ఐసిస్‌తో పొంచి ఉన్న ముప్పు
ఆఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం 2వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. కాబూల్ విమానాశ్రయం వద్ద ఇటీవల ఐసిస్ చేసిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 200 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 30) మరో ఆత్మాహుతి దాడికి ఐసిస్ యత్నించగా అమెరికా వైమానిక దళం రాకెట్ లాంచర్లతో ఆ వాహనాన్ని పేల్చేసింది. ఈ ఘటనలో 10 మంది సాధారణ ఆఫ్గన్ పౌరులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. అమెరికా ఆఫ్గనిస్తాన్‌ను వీడిన నేపథ్యంలో ఐసిస్ మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. కొత్త రిక్రూట్‌మెంట్లు జరుపుతూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఐసిస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆఫ్గన్‌లో ఐసిస్ దాడులకు తెగబడితే... ప్రతిగా తాలిబన్లు దాడులకు పాల్పడుతారు. అదే జరిగితే ఆఫ్గనిస్తాన్‌లో పెను విధ్వంసం తప్పకపోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది.

బైడెన్ సమర్థన...
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే.'20 ఏళ్ల క్రితం స్పష్టమైన లక్ష్యాలతో మేము ఆఫ్గన్ గడ్డపై అడుగుపెట్టాం. సెప్టెంబర్ 11,2001న అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మరోసారి మాపై దాడి చేసేందుకు ఆఫ్గనిస్తాన్ వేదిక కావొద్దని భావించాం. అనుకున్నట్లుగానే మా లక్ష్యాలను చేరుకున్నాం. అల్ ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశాం.ఒసామా బిన్ లాడెన్ వేటలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు.20 ఏళ్ల క్రితం అతన్ని మట్టుబెట్టాం.' అని గతంలోనే జో బైడెన్ పేర్కొన్నారు.
ఒక దేశంగా ఆఫ్గనిస్తాన్‌ను నిలబెట్టడమో లేక అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమో అమెరికా మిషన్ కాదన్నారు. ఆఫ్గన్ గడ్డ పైనుంచి అమెరికాపై దాడి జరగకుండా చూసుకోవడమే ఇప్పటికీ తమ ఏకైక జాతీయ ఎజెండాగా చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌లో తిరుగుబాటును అణచివేయడమో లేక ఆ దేశాన్ని నిలబెట్టడమో మా పని కాదు... ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే మా ఫోకస్ ఉంటుందని చాలా ఏళ్లుగా తన వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు. తమది కాని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోదలుచుకోలేదన్నారు. ఆఫ్గన్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. అయితే పోరాడాలనే సంకల్పాన్ని మాత్రం ఇవ్వలేకపోయామన్నారు.












Click it and Unblock the Notifications