కరోనా కష్టాలు- కంటైనర్ల కొరతతో ఆహార వాణిజ్యంపై తీవ్ర ప్రభావం- ధరల మంట తప్పదా ?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెచ్చిపెట్టిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా ఒకప్పుడు వాణిజ్య కేంద్రాలుగా వర్ధిల్లిన ప్రాంతాలన్నీ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. కార్మికుల కొరతతో రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే క్రమంలో తాజాగా సముద్రంలో కంటైనర్ల రవాణాకు భారీ డిమాండ్ నెలకొనడంతో అంత ఖర్చుపెట్టి ఎగుమతులు చేయలేని దేశాలు మౌనంగా రోదిస్తున్నాయి. ఇదే పరిస్ధితి మరికొంతకాలం కొనసాగితే భవిష్యత్తులో ఆహార సంక్షోభం తప్పేలా లేదు. దీంతో అంతర్జాతీయంగా దీనిపై విస్తృత చర్చ సాగుతోంది.

కరోనా తెచ్చిన కష్టాలు
కరోనా వైరస్ ప్రభావం కారణంగా పలు దేశాలు రక్షణాత్మక ధోరణిలోకి మారిపోయాయి. అత్యవసరం అనుకుంటే తప్ప గతంలోలా ఖర్చుపెట్టేందుకు సిద్ధం కావడం లేదు. వ్యయ నియంత్రణ ప్రభావం ముందుగా వాణిజ్యంపైనే పడుతోంది. ఒకప్పుడు కోట్ల రూపాయల వాణిజ్యం చేసిన సంస్ధలన్నీ ఇప్పుడు వాటిలో పదో వంతు కూడా చేయలేక గగ్గోలు పెడుతున్నాయి. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నాయి. వీటిలో రవాణా భారం పెరగడం, కార్మికుల కొరత, పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు ఆహార వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కరోనా కారణంగా పలు దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం ప్రధాన కారణం.

కంటైనర్ల కొరతతో సంక్షోభం
ఓ దేశం నుంచి మరో దేశానికి సముద్ర మార్గంలో కంటైనర్లు ఆహార పదార్ధాలను తీసుకెళ్లినప్పుడు తిరిగి అవి ఖాళీగా తిరిగి రావడం పూర్తిగా అసాధారణం కాకపోయినా అరుదుగా జరుగుతుంటుంది. ఇరువైపులా రవాణా జరిగితేనే వాటికి ధర గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రస్తుతం చైనా నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణం కంటే పదిరెట్లు ఎక్కువవుతోంది. దీంతో కంటైనర్లను లోడ్ చేయడానికి బదులుగా ఖాళీగా పంపితేనా నాలుగు డబ్బులు మిగిలే పరిస్ధితి ఉంటుందని తెలుస్తోంది. కంటైనర్ కార్గో కోసం అమెరికాలోని అతిపెద్ద ఓడరేవు అయిన లాస్ ఏంజిల్స్ నౌకాశ్రయంలో, ఆసియాకు తిరిగి వెళ్ళే ప్రతి నాలుగు పెట్టెల్లో మూడు సాధారణ 50% రేటుతో వెళ్లేవి. కానీ ఇప్పుడు అవన్నీ ఖాళీగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అవి మరో దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులకు కూడా వెళ్లలేని పరిస్ధితి నెలకొంది. కాబట్టి ఆయా దేశాల్లో ఆహార వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

భారత్ సహా పలు దేశాలపై ప్రభావం
ప్రపంచంలోనే పప్పు దినుసుల ఉత్పత్తిలో రెండోస్ధానంలో ఉన్న కెనడాతో పాటు ఎగుమతులపై భారీగా ఆధారపడిన భారత్ వంటి దేశాలపై కూడా ఈ కంటైనర్ల కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భారతదేశం జనవరిలో 70,000 మెట్రిక్ టన్నులను మాత్రమే ఎగుమతి చేసింది. గతేడాది ఇదే సమయంలో భారత్ చేసిన చక్కెర ఎగుమతిలో ఐదో వంతు కంటే తక్కువ అని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అలాగే తక్షణ పానీయాలు మరియు ఎస్ప్రెస్సో తయారీకి ఉపయోగించే రోబస్టా కాఫీ గింజల యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు వియత్నాం కూడా ఎగుమతులకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నవంబర్, డిసెంబర్లో వియత్నాం కాఫీ ఎగుమతులు 20% కంటే ఎక్కువ పడిపోయినట్లు తెలుస్తోంది. కంటైనర్ల కొరత విషయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వేచిచూసే ధోరణి అవలంబిస్తుండగా.. మరికొందరు పూర్తిగా కొనుగోళ్లు కూడా నిలిపేసిన పరిస్ధితి కనిపిస్తోంది.

ఆహార పదార్ధాల ధరలకు రెక్కలు
ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ల కొరత కారణంగా ఆహార పదార్ధాల కొరత కనిపిస్తోంది. ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభాపం పడుతుండటంతో ఆహార పదార్దాల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే చైనా దిగుమతి చేసుకుంటున్న పలు సరుకులు నిలిచిపోవడంతో అక్కడ ధరల పెరుగుదల కనిపిస్తోంది. భారత్‌లోనూ దిగుమతులపై ప్రభావం పడి ఇక్కడా ధరలకు రెక్కలొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు కొనసాగుతున్నందున, ప్రపంచంలోని పందిమాంసం అగ్రశ్రేణి వినియోగదారు అయిన చైనాలో హోల్‌సేల్ ధరలు సెప్టెంబర్ నుంచి అత్యధిక స్ధాయికి చేరుకుంటున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కార్మికుల కొరత వల్ల ఓడరేవులలో కార్యకలాపాలు మందగించడం ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చింది.