ఆ హోటల్స్ వదిలి వెళ్ళండి; కాబూల్ లో తమ పౌరులకు ఉగ్రదాడి హెచ్చరిక చేసిన యూఎస్, యూకే దేశాలు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరమైన కాబూల్ హోటల్స్ లో ఉన్న తమ దేశీయులకు ముప్పు పొంచి ఉందని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు హెచ్చరించాయి. వారిపై ఉగ్రదాడులకు అవకాశం ఉందని, కాబూల్ నగరంలోని హోటళ్లకు దూరంగా ఉండాలని యూకే, యూఎస్ ప్రభుత్వాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.

ఆఫ్ఘనిస్థాన్ లోని తమ పౌరులను అలెర్ట్ చేసిన యూఎస్, బ్రిటన్ లు
ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ గ్రూపు ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లో మతపరమైన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో మసీదులో 40 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు నిర్వహించే అవకాశం ఉందని అమెరికా మరియు బ్రిటన్ సోమవారం తమ పౌరులను హెచ్చరించాయి. ముఖ్యంగా సెరెనా హోటల్ వద్ద, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న యూఎస్ పౌరులు తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించింది. ఇక బ్రిటన్ కూడా తమ దేశ పౌరులకు ఇదే తరహా ప్రకటన చేసింది. ఆఫ్గనిస్థాన్ దేశంలో పెరిగిన దాడుల నేపథ్యంలో హోటళ్లలో ఉండవద్దని, మరీ ముఖ్యంగా కాబూల్లోని సెరెనా హోటల్ ను విడిచి వెళ్లండి అంటూ రెండు దేశాలు సూచనలు చేశాయి.

కాబూల్లోని సెరెనా హోటల్ నుండి వెళ్ళిపోవాలని హెచ్చరిక
తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, చాలా మంది విదేశీయులు ఆఫ్ఘనిస్తాన్ విడిచి స్వదేశాలకు వెళ్లిపోయారు. కానీ కొంతమంది పాత్రికేయులు మరియు కార్మికులు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉన్నారు. చాలామంది విదేశాలకు చెందిన వారు కాబూల్లోని సెరెనా హోటల్ లో బస చేస్తారు. వ్యాపార ప్రయాణికులు, విదేశీ అతిథులతో ప్రసిద్ధి చెందిన విలాసవంతమైన హోటల్ సెరెనా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఈ హోటల్ పై గతంలోనూ రెండుసార్లు తాలిబాన్ల దాడులు జరిగాయి. 2014 లో, అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు, నలుగురు యువకులు వారి సాక్స్‌లో పిస్టల్‌లను దాచిపెట్టి ఈ హోటల్ లోకి ప్రవేశించి ఏఎఫ్ బి జర్నలిస్ట్ మరియు అతని కుటుంబ సభ్యులతో సహా తొమ్మిది మందిని హతమార్చారు. అంతకుముందు 2008 లో ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించారు.

గతంలో ఎయిర్ పోర్ట్ పై దాడి ముందే హెచ్చరించిన దేశాలు .. చెప్పిన గంటల వ్యవధిలోనే ఉగ్ర దాడి
ఆగస్టులో, ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ దేశాల పౌరులను తరలించే క్రమంలో విమానాశ్రయంలో దాడులకు అవకాశం ఉందని నాటో దేశాలు కాబూల్ విమానాశ్రయం నుండి దూరంగా ఉండమని ప్రజలకు తెలియజేయడంతో, ముప్పు గురించి హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరించిన గంటల వ్యవధిలోనే, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులతో పాటు 13 అమెరికన్ సైనికులు మరణించారు. గత శుక్రవారం కుందుజ్ నగరంలో జరిగిన వినాశకరమైన బాంబు దాడి మసీదులో చోటుచేసుకోగా 40 మందికి పైగా మరణించారు. అమెరికా దళాలు దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన అత్యంత దారుణమైన మారణకాండ ఇది.

యూఎస్, యూకే పౌరులకు ఉగ్ర ముప్పు.. ఏం జరుగుతుందో టెన్షన్
ఇక ఇప్పుడు మరో మారు యూఎస్, మరియు యూకె పౌరులను టార్గెట్ చేస్తూ కాబూల్లోని హోటల్స్ పై ఉగ్ర దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకుని, ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటించిన తాలిబాన్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠా పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఉగ్రదాడుల ను నివారించడానికి, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ గుర్తింపును , అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది తాలిబన్ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications