వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వర్షపు నీరు

తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత పరిమళభరితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మరి ఆ సువాసన ఎందుకు వస్తుంది?

అందుకు పలు కారణాలు ఉన్నాయి. అందులో కెమిస్ట్రీ దాగి ఉంది.

ఆ సువాసన విడుదలలో బ్యాక్టీరియా, మొక్కలతో పాటు ఉరుములు, మెరుపుల పాత్ర కూడా ఉంటుంది.

ఇంగ్లీషులో 'పెట్రికో' అని పిలిచే ఈ పరిమళం రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మట్టి

మట్టిలోని బ్యాక్టీరియా

బాగా ఎండిపోయిన నేలలు తొలకరి వానలకు తడిసినప్పుడు.. ఆ మట్టిలోని ఒక రకమైన బ్యాక్టీరియా జియోస్మిన్ (C12H22O) అనే ‎రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఆ రసాయనం వల్లనే సువాసన వెలువడుతుందని ఇంగ్లాండ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌లో మాలిక్యులర్ మైక్రోబయాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ మార్క్ బట్నర్ బీబీసీకి వివరించారు.

ఆ బ్యాక్టీరియా పేరు 'స్ట్రెప్టోమైసెస్'. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన కన్నౌజ్ ప్రాంతంలో ఇప్పటికీ మట్టి సువాసన ఇచ్చే అత్తర్లు తయారు చేస్తున్నారు.

మే, జూన్ మాసాల్లో తొలకరి జల్లులు పడినప్పుడు వెలువడే జియోస్మిన్‌ను సేకరించి 'మట్టీ కా అత్తర్' పేరుతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్‌లో అత్తర్లను తయారు చేస్తారు.

1960లలో దాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియా పరిశోధకులు ఇసాబెల్ బియర్, ఆర్‌జీ థామస్‌ ఆ మట్టి పరిమళానికి 'పెట్రికో' అని ఇంగ్లీషు పేరు పెట్టారు.

వర్షం

పేరు ఎందుకు పెట్టారు?

1964లో జర్నల్ నేచర్ అనే పత్రికలో 'నేచర్ ఆఫ్ అగ్రిల్లేసియస్ ఆడర్' పేరుతో శాస్త్రవేత్తలు ఇసాబెల్, రిచర్డ్ థామస్‌లు ప్రచురించిన కథనంలో 'పెట్రికో' అనే పదాన్ని ప్రస్తావించారు.

'పెట్రోస్' అంటే గ్రీకు భాషలో 'రాయి' అని అర్థం. 'ఇకోర్' అంటే "దేవుడి నరాల్లో ప్రసరించే ద్రవం" అని అర్థం.

వర్షపు నీరు, సాలెగూడు

ఆ బ్యాక్టీరియాను మందుల్లోనూ వాడుతున్నారు

స్వచ్ఛమైన మట్టిలో 'స్ట్రెప్టోమైసెస్' బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందని మార్క్ బట్నర్ తెలిపారు.

ప్రస్తుతం యాంటీ‌బయాటిక్ మందుల తయారీలోనూ ఈ బ్యాక్టీరియాను వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం అనేక రకాల అత్తర్ల తయారీలోనూ C12H22Oను విరివిగా వాడుతున్నారు.

దీని వాసనను ఇతర జంతువుల కంటే మనుషులే ఎక్కువ స్పష్టంగా పసిగట్టగలరని ప్రొఫెసర్ బట్నర్ వివరించారు.

C12H22O వాసన అందరూ ఆస్వాదిస్తారు. కానీ.. దాని రుచిని మాత్రం అసహ్యించుకుంటారు.

"అదేమీ ప్రమాదకరం కాదు. అయినా మనం ఎందుకు దాని రుచిని అంతగా అసహ్యించుకుంటామో తెలియడంలేదు" అని డెన్మార్క్‌లోని ఆల్‌బోర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెప్పే లండ్ నీల్సన్ అన్నారు.

వర్షపు నీరు

మొక్కల నుంచి

మొక్కల్లో సువాసన ఇచ్చే 'టాపీన్ (C10H16)' అనే కార్బన సమ్మేళనాలతో జియోస్మిన్‌‌ను పోల్చవచ్చని ప్రొఫెసర్ నీల్సన్ చెప్పారు.

"మొక్కల ఆకులకు ఉండే కేశాలలో టాపీన్లు ఉత్పత్తి అవుతాయి. అయితే వర్షం పడినప్పుడు ఆ కేశాలు దెబ్బతిని టాపీన్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది" అని ప్రొఫెసర్ ఫిలిప్ స్టీవెన్సన్ బీబీసీకి వివరించారు.

అలాగే.. వాతావరణం మరీ పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత చిరు జల్లులు పడితే కూడా ఆ మొక్కల నుంచి సువాసన వెలువడుతుంది.

ఎండిన కట్టెలు వానకు తడిసినప్పుడు కూడా జియోస్మిన్‌ లాంటి సువాసన ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయని స్టీవెన్సన్ తెలిపారు.

మబ్బుల్లో మెరుపులు

ఉరుములతో కూడిన వానల వల్ల

ఉరుములతో కూడిన గాలివానల వల్ల కూడా అలాంటి వాసన వెలువడుతుంది. ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు పెద్దఎత్తున మెరుపులు వస్తాయి, పిడుగులు పడుతుంటాయి. అప్పుడు ఓజోన్ వాయువు వాసన స్పష్టంగా వస్తుంది.

అందుకే దట్టంగా మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులతో వాన పడిన తర్వాత ఆరుబయట ఉండి గమనిస్తే వాసన చాలా భిన్నంగా ఉంటుంది.

"సాధారణంగా వర్షాలు పడనప్పుడు వాతావరణంలో దుమ్ము, ధూళి, కలుషితాలు అధికంగా ఉంటాయి. అదే ఒక్కసారిగా వర్షాలు పడ్డప్పుడు గాలి అంతా శుభ్రమవుతుంది, అందుకే వర్షం పడ్డప్పుడు పరిశుభ్రమైన ఓజోన్ వాసన వస్తుంది" అని అమెరికాలోని మిసిసిపి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మారిబెత్ స్టోల్సన్‌బర్గ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is the reason for the smell of mud in the early showers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X