దేవుడా అంతా సవ్యంగా జరగాలి..!
ప్రపంచ శాంతి కోసం అత్యంత కీలకమైన సమావేశం అలాస్కాలోని యాంకరేజ్‌లో జరగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్‌లో జరిగే ఈ భేటీపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆగస్టు 16న జరిగే ఈ చర్చలు, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతాయా అనే ఆశలను రేకెత్తిస్తున్నాయి.
ట్రంప్ ఈ చర్చలను ఒక "చదరంగ ఆట"తో పోల్చారు. పుతిన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మరోవైపు, చర్చలు విఫలమైతే తాను సమావేశం నుంచి మధ్యలోనే వెళ్ళిపోతానని, వేగంగా ఇంటికి తిరిగివస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. పుతిన్ తనతో వ్యాపారులను తీసుకువస్తున్నారని, ఇది ఒక మంచి సంకేతమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, రష్యా అధ్యక్షుడు ఈ సమావేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాత్రం మాస్కో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని, చర్చల రోజున కూడా దాడులు జరిపి ప్రజలను చంపుతున్నారని తీవ్రంగా విమర్శించారు.మరోవైపు పుతిన్, డొనాల్డ్ ట్రంప్ భేటీలో ఏమాత్రం తేడా వచ్చిన అది ఇండియాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఇండియాపై అధిక సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ బెంబేలెత్తిస్తున్నారు. ఈ కీలక భేటీలో ఏం జరుగుతుందో, ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచానికి శాంతి లభిస్తుందా లేదా అనేది రేపు అర్ధరాత్రి తేలిపోనుంది.












Click it and Unblock the Notifications