Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ వార్ పై ట్రంప్ వర్సెస్ ట్రంప్..! పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?

ఇరాన్ పై స్పష్టమైన కారణం ఏదీ లేకుండానే ఇజ్రాయెల్ తో కలిసి సైనిక చర్య ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఇప్పుడు ఈ యుద్దంలో నుంచి ఎలా బయటకు రావాలో తెలియక తీవ్ర గందరగోళంలోకి జారుకుంటున్నట్లు అర్దమవుతోంది. ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధానికి సమర్థన, అమెరికా లక్ష్యాలు, యుద్ద కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. ట్రంప్,ఆయన బృందం చేస్తున్న పరస్పర విరుద్ద ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తొలుత ట్రంప్.. ఇరాన్‌లో అధికార మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే యుద్ధం ఎన్నాళ్లనే గడువును కూడా పదే పదే సవరించుకుంటున్నారు. దీంతో ట్రంప్ ఇరాన్ వార్ పై ఎంత గందరగోళంలో ఉన్నారో అర్ధమవుతోంది.

ఆయుధాలపై ట్రంప్ రోజుకో ప్రకటన (trump)

అమెరికా, ఇరాన్ ఆయుధ నిల్వలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో గందరగోళాన్ని బయటపెట్టాయి. తాజాగా అమెరికాకు అపరిమిత ఆయుధ సరఫరా ఉందని, శాశ్వతంగా యుద్దాలు చేయగలదని ట్రంప్ తెలిపారు. అలాగే ఇరాన్ వద్ద లాంచర్ లు అయిపోతున్నాయని కూడా చెప్పారు. కానీ ఇరాన్ హ్రాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతమంతా ఇప్పటికీ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. అమెరికా రక్షణ కంపెనీలు ఆయుధ ఉత్పత్తిని పెంచడానికి అత్యవసర ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అపరిమిత ఆయుధాలు ఉన్నాయి కదా అంటే ట్రంప్ దగ్గర సమాధానం లేదు. అమెరికా సెనేటర్లు మాత్రం రాబోయే క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ల నిల్వలో కొరత ఉందని చెప్తున్నారు. ఇరాన్ నిరంతరం ప్రయోగిస్తున్న తక్కువ ఖర్చుతో కూడిన క్షిపణి దాడులు ఇప్పటికే పాశ్చాత్య రక్షణ వ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

Trump vs Trump The Contradictory Rhetoric Guiding the US-Iran Standoff

ఇరాన్ నాయకత్వంపైనా అదే తీరు

ఇరాన్‌పై సైనిక దాడులు అక్కడి మతపరమైన పాలన యొక్క నాయకత్వ వారసత్వాన్ని చాలావరకు తుడిచిపెట్టేశాయని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు, 48 మంది ముఖ్య ఇరాన్ నాయకులు అంతం చేశామన్నారు. అదే నిజమైతే..ఇరాన్ ఇప్పటికీ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఎందుకు, ఎలా దాడులు చేయగలుగుతోంది? గత నాలుగు రోజుల్లో బహ్రెయిన్, ఇరాక్, యూఏఈ, ఖతార్ , కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులెలా జరిగాయి. ఇవాళ ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్, అయతుల్లా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. తద్వారా నాయకత్వ శూన్యతను నివారించింది. దీంతో ట్రంప్ మరో వాదన కూడా తేలిపోయింది.

ఇరాన్ అణు ముప్పుపైనా యూటర్న్

ఇరాన్ నుండి ఉన్న అణు ముప్పు గురించి ట్రంప్ వ్యాఖ్యలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి. గత జూన్‌లో ఇరాన్ పై చేసిన స్వల్ప దాడి తర్వాత ట్రంప్ ఇరాన్ అణు సదుపాయాలపై అమెరికా దాడులు దాని అణు కార్యక్రమాన్ని "పూర్తిగా నాశనం" చేశాయని ప్రకటించారు. తిరిగి మార్చి 2వ తేదీకి వస్తే, ప్రస్తుత యుద్ధంలోని అమెరికా లక్ష్యాలు "స్పష్టంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇందులో ఇరాన్ అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం, దాని అణు ఆశయాలను అంతం చేయడం ఉన్నాయన్నారు. గత జూన్‌లోనే అమెరికా అణు కార్యక్రమాన్ని నాశనం చేస్తే మళ్ళీ నాశనం చేయడానికి ఏముంది? అలాగే ఇరాన్ ముందుగా దాడి చేయబోతోందా అనే విషయంలో ట్రంప్, ఆయన విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య వైరుధ్యం కనిపించింది. ఇరాన్ ముందుగా దాడి చేయబోతోందని తాను నమ్ముతున్నందున అమెరికా బలగాలు ఇజ్రాయెల్ దండయాత్రలో చేరాలని ట్రంప్ ఆదేశించారని ఆయన చెప్పారు. కానీ మేం చేయకపోతే వాళ్లే దాడి చేయబోతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

యుద్ధం ఎన్నాళ్లో కూడా చెప్పలేక

అలాగే ఇరాన్ పై యుద్ధం ఎన్నాళ్లన్న ప్రశ్నకు కూడా ట్రంప్ రోజుకో సమాధానం చెప్తున్నారు. ముందు ఈ యుద్దం రెండు, మూడు రోజులే అన్న ట్రంప్.. ఆ తర్వాత ఒక వారానికి పెంచారు. ఇప్పుడు నాలుగు నుండి ఐదు వారాల వరకు ఉంటుందని మళ్లీ పెంచి చెప్తున్నారు. ఇలా ఎంతకాలం యుద్ధ గడువును పెంచుకుంటూ పోతారన్నది తేలడం లేదు. ఉక్రెయిన్ యుద్దం తరహాలో అంతులేని యుద్దం చేయాలని ట్రంప్ అనుకుంటున్నారా, అలాంటి యుద్దానికి అమెరికాలో మద్దతు లభిస్తుందా అన్న చర్చ ఇప్పుడు పెరుగుతోంది. దీంతో ట్రంప్ పద్మవ్యూహ్మంలో చిక్కుకుపోతున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+