Tsunami: ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలు-7.5 తీవ్రతతో భూకంపం...
ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో ఇవాళ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ అందించిన వివరాల ప్రకారం ఈ భూకంప కేంద్రం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గత నెలలో దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వచ్చిన 6.7 తీవ్రత కల భూకంపం కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంత జరిగిందన్నదీ ఇంకా తెలియరాలేదు. అంతలోనే సునామీ హెచ్చరికలు కూడా రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నవంబర్ 17న వచ్చిన భూకంపంలో మరణాలు ఎక్కువగా సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులలో నమోదయ్యాయి. ఈ భూకంపంలో 13 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపమే ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. అలాగే ఈ భూకంపం కారణంగా 50కి పైగా ఇళ్లు, ఇతర భవనాలు ధ్వంసం అయ్యాయి. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప, అగ్నిపర్వత క్రియాశీల జోన్ గా గుర్తించింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మరోసారి భూకంపం రావడం, సునామీ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications