భారత్‌పై ట్విట్టర్ తప్పు, కోహ్లీ పాక్ ఫ్యాన్‌కు నో బెయిల్
న్యూఢిల్లీ/లాహోర్: భారత భూభాగాలను విదేశీ భూభాగాలుగా చూపిస్తూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ భారీ తప్పుకు పాల్పడింది. జమ్మును పాకిస్థాన్‌లో భాగంగా, జమ్ము కాశ్మీరును చైనాలో భాగంగా చూపించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరును పాకిస్థాన్‌లోని అజాద్ కశ్మీరు ప్రావిన్సుగా ట్విట్టర్ గుర్తించింది.
దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ట్విట్టర్‌తో మాట్లాడతామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్ ఇండియా పేర్కొంది.
ఖాతాదారు కొత్త ట్వీట్‌ను పోస్ట్ చేసినప్పుడు తన ప్రదేశాన్ని ట్యాగ్ చేసుకునే అవకాశం ఉంది. గురువారం ఒక ఖాతాదారు ట్యాగ్ చేసినప్పుడు జమ్మును పాకిస్థాన్‌లో, మరొకరు జమ్ము కాశ్మీరును ట్యాగ్ చేసినప్పుడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా చూపించింది.

కోహ్లీ అభిమాని బెయిల్ పిటిషన్ తిరస్కరణ
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అభిమాని ఉమర్ దర్జ్‌కు పాకిస్థాన్ న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది. ఈ కేసులో వాదనలు తొమ్మిది సార్లు వాయదాపడ్డ తర్వాత స్థానిక కోర్టు ఉమర్ బెయిల్ దరఖాస్తును కొట్టిపారేసింది.
కోహ్లీ అభిమాని తన ఇంటి మీద భారతీయ జెండాను ఎగురవేయడంతో పాకిస్థాన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 25న పాకిస్థాన్‌లోని సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఉమర్‌ను సెక్షన్ 123-ఏ, 16 ఎంపీవో కేసు కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు అతన్ని రిమాండ్‌లో ఉంచారు.
అయితే లాయర్ అమీర్ అజీమ్ భాట్టి ఈ నెల 4వ తేదీన ఉమర్ తరపున బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డు సమర్పించాలంటూ ఈనెల 6న పోలీసులకు ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 9వాయిదాల తర్వాత ఉమర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ కేసులో అతను పదేళ్ల శిక్షను ఎదుర్కొంటున్నాడు.












Click it and Unblock the Notifications