వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ సంక్షోభం: మిన్స్క్ ఒప్పందాలు ఏంటి? ఇవి రష్యా దాడి నుంచి యుక్రెయిన్‌ను కాపాడేవా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.

మిన్స్క్ ఒప్పందాలను పుతిన్ గాలికొదిలేశారని అమెరికా పేర్కొంది. రష్యా, యుక్రెయిన్ల మధ్య వివాదాలను 2015లో జరిగిన మిన్స్క్ ఒప్పందం ప్రకారం పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితి రాజకీయ వ్యవహారాల చీఫ్ రోజ్‌మేరీ ఎ. డికార్లో గతంలో అన్నారు.

యుక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలు డొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు ఇటీవల రష్యా ప్రకటించింది. దాంతో, మిన్స్క్ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకొచ్చాయి.

ఇంతకూ, మిన్స్క్ ఒప్పందాలు అంటే ఏమిటి? యుక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తతలకు ఇదెలా పరిష్కారం చూపిస్తుంది? తెలుసుకుందాం.

మిన్స్క్ ఒప్పందాలలో ఏముంది?

తూర్పు యుక్రెయిన్‌లో రష్యా మద్దతుగల వేర్పాటువాదులకు, యుక్రెయిన్ సైన్యానికి మధ్య జరిగిన రక్తపాతం తరువాత 2014లో మిన్స్క్-1, 2015లో మిన్స్క్-2 ఒప్పందాలు జరిగాయి.

2015 ఫిబ్రవరిలో బెలారస్ రాజధాని మిన్స్క్‌లో రష్యా, యుక్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ నేతల సమక్షంలో మిన్స్క్-2 ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, రష్యా అండతో వేర్పాటువాదులు ఆక్రమించిన ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలి.

ఈ ఒప్పందం తరువాత, యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాలను లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అని పిలవడం ప్రారంభించారు.

తిరుగుబాటుదారులను ఉసిగొల్పి, వారి ద్వారా రష్యా ఈ ప్రాంతాలను ఆక్రమించుకుందని యుక్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది.

మిన్స్క్ ఒప్పందం-2లో కీలకాంశాలు ఏమిటి?

రష్యా, యుక్రెయిన్, వేర్పాటువాద నాయకులు, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్‌సీఈ) సంయుక్తంగా మిన్స్క్-2 ఒప్పందంపై సంతకం చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ద్వారా దీన్ని ఆమోదించారు.

2015 ఫిబ్రవరి 11 రాత్రి ఈ ఒప్పందం జరుగుతున్నప్పుడు కూడా తిరుగుబాటుదారులకు, యుక్రెయిన్ సైన్యానికి మధ్య భీకర పోరాటం కొనసాగింది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది.

బీబీసీ నివేదిక ప్రకారం ఈ ఒప్పందంలో 11 ముఖ్యంశాలు ఉన్నాయి.

1. ఇందులో మొదటి షరతు.. ఇరువైపుల నుంచి తక్షణ కాల్పుల విరమణ

2. ఇరువైపులా భారీ ఆయుధాలను ఉపసంహరించుకోవాలి. ఇరువైపులా కనీసం 50 కిమీ బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు రెండు పక్షాలు సమాన దూరంలో వెనక్కు తగ్గాలి.

3. ఓఎస్‌సీఈ దీన్ని పర్యవేక్షిస్తుంది.

4. బలగాలు వెనక్కు తగ్గిన మొదటిరోజు నుంచే స్థానిక ఎన్నికలపై చర్చలు ప్రారంభమవుతాయి.

5. డొనెట్స్క్, లుహాన్స్క్ యుద్ధాలలో పాల్గొన్నవారికి క్షమాభిక్ష

6. బందీలుగా ఉన్నవారిని, అక్రమంగా నిర్బంధానికి గురైనవారిని విడుదల చేయాలి.

7. రెండు దేశలూ పరస్పరం మానవతా సహాయాన్ని అందిస్తాయి. ఇది అంతర్జాతీయ పర్యవేక్షణలో జరుగుతుంది.

8. ప్రభావిత ప్రాంతాలలో ఆర్థిక, సామాజిక సంబంధాల పునరుద్ధరణ

9. వివాదాస్పద ప్రాంతంలో తమ దేశ సరిహద్దులపై యుక్రెయిన్ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది.

10. యుక్రెయిన్ నుంచి విదేశీ సాయుధ దళాల ఉపసంహరణ

11. యుక్రెయిన్‌లో రాజ్యంగ సంస్కరణ. 2015 చివరికి కొత్త రాజ్యాంగం అమలులోకి వస్తుంది.

ఒప్పందం తర్వాత ఏం జరిగింది?

ఓఎస్‌సీఈ పర్యవేక్షణ మూలంగా యుద్ధం ఆగిపోయింది. కానీ, అప్పుడప్పుడూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే, ఎక్కువ కాదు.

ఈ యుద్ధం కారణంగా సుమారు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,000 మంది నిరాశ్రయులయ్యారు.

యుక్రెయిన్

ఒప్పందం తరువాత కూడా వివాదం ఎందుకొచ్చింది?

వాస్తవానికి, మిన్స్క్ ఒప్పందం హడావిడిగా జరిగింది. రష్యా దీనిపై సంతకం చేసింది కానీ, వివాదంలో రష్యా పాత్ర ఏమిటో ఇందులో వివరించలేదు. ఒప్పంద పత్రంలో రష్యా ప్రస్తావన కూడా లేదు.

"ఈ ఒప్పందం యుక్రెయిన్ ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు మధ్య జరగాలి. తమ దేశం కేవలం అబ్జర్వర్‌గా ఉంటుంది" అని రష్యా పేర్కొంది.

వేర్పాటువాదులకు రష్యా సహాయం అందిస్తున్నట్టు కచ్చితమైన ఆధారాలు లభించినప్పటికీ, రష్యా పై వాదనలు చేసింది.

మరోవైపు, తిరుగుబాటుదారులతో ప్రత్యక్ష చర్చలకు యుక్రెయిన్ నిరాకరించింది.

ఒప్పందంలో వాడిన భాష స్పష్టంగా లేకపోవడంతో, రష్యా, యుక్రెయిన్‌లు వేర్వేరు వ్యాఖ్యానాలు ఇస్తున్నాయి.

వివాద ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించకముందే అంతర్జాతీయ సరిహద్దుపై యుక్రెయిన్ పూర్తి అధికారం కోరుకుంటోంది. రష్యా సేనలు వెనక్కు మరలాలని కూడా ఆశిస్తోంది.

అయితే, తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న ప్రాంతాలలో తమ సైన్యం లేనే లేదని రష్యా చెబుతోంది.

యుక్రెయిన్ సైన్యం సరిహద్దులను స్వాధీనం చేసుకోకముందే డొనెట్స్క్, లుహాన్స్క్‌లలో ఎన్నికలు నిర్వహించాలని రష్యా కోరుతోంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నించాయిగానీ విజయం సాధించలేకపోయాయి.

మిన్స్క్ ఒప్పందానికి పుతిన్‌కు ఎందుకంత ప్రాముఖ్యమిస్తున్నారు?

రష్యా వైపు నుంచి చూస్తే, డాన్‌బాస్‌లో తిరుగుబాటుదారుల ద్వారా యుక్రెయిన్‌పై తమ ప్రభావాన్ని కొనసాగించవచ్చు. తద్వారా ఈ ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు.

అలాగే, యుక్రెయిన్ వ్యవహారాల్లో రష్యా జోక్యం కొనసాగుతుంది. ఇటీవల డాన్‌బాస్ ప్రాంతంలో అనేకమందికి రష్యన్ పాస్‌పోర్ట్ ఇవ్వడంతో సమస్య మరింత జటిలమైంది.

అదే విధంగా, యుక్రెయిన్ పార్లమెంటులో తమ మద్దతుదారులను ప్రోత్సహించవచ్చు. వీళ్లంతా యుక్రెయిన్ నాటోలో చేరకుండా అడ్డుకోగలరు.

యుక్రెయిన్, నాటో సభ్యత్వం పొందకూడదని రష్యా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలకు ఇదే అతిపెద్ద కారణం.

మిన్స్క్ ఒప్పందంపై ఇంకా ఆశలుఎందుకు?

ప్రస్తుత ఉద్రిక్తతలకు మిన్స్క్ ఒప్పందం ముగింపు పలకగలదని అమెరికా, ఫ్రాన్స్ పేర్కొన్నాయి. కాగా, యుక్రెయిన్ నాటోలో చేరుతుందా, లేదా అన్నది ఈ ఒప్పందంలో స్పష్టంగా ప్రస్తావించలేదు.

ఒప్పందం ప్రకారం, సరిహద్దులపై యుక్రెయిన్‌కు అధికారం వస్తుంది. ఇది అమలు అయితే రష్యా దాడిని నియంత్రించవచ్చు.

రష్యా దాడినుంచి రక్షించడానికి మిన్స్క్ ఒప్పందం సహకరిస్తుందని యుక్రెయిన్‌లో చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ, ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine crisis: what are the Minsk agreements? Will these save Ukraine from Russian aggression
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X