భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలి - క్రూరంగా దాడులు : జెలెన్‌స్కీ..!!
ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు అత్యంత క్రూరంగా కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చివరకు అంబులెన్సులపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు. బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని మరోమారు డిమాండ్ చేసారు. అందులో భాగంగా ఐరాస భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మారణహోమంగా అభివర్ణించారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించేందుకు యావత్ ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ షాకిచ్చింది. జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అంబాసిడర్ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజేఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. బెలారస్‌లోని గోమెల్ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

పోలండ్ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్, అజర్‌బైజాన్ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు. సైన్యంలో పనిచేసిన అనుభం ఉన్న ఐరోపావాసులెవరైనా సరే ఉక్రెయిన్ చేస్తున్న పోరాటంలో చేరాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. జర్మినీ తో సహా పలు ఐరోపా దేశాల నుంచి ఉక్రెయిన్ ను మద్దతు లభిస్తోంది. ఆయుధాలతో పాటుగా సహకారం అందిస్తున్నాయి. అయితే, రష్యా మాత్రం ఇంకా దాడులను కొనసాగిస్తూనే ఉంది.












Click it and Unblock the Notifications