రష్యాకు మరిన్ని ఎదురుదెబ్బలు-మూడు విమానాలు కూల్చివేత- మరియపోల్ దాడికి ప్రతీకారం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ రష్యా అనుకున్న ఫలితాన్ని రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. మరోవైపు రష్యాపై ఆంక్షల కత్తి నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో యుద్ధం నుంచి తప్పించుకునేదెలాగో తెలియక పుతిన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది.
రష్యాకు చెందిన మూడు యుద్ద విమానానాలను తాము కూల్చేసినట్లు ఉక్రెయిన్ ఇవాళ ప్రకటించింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తోంది. ఇందుకోసం వాడుతున్న యుద్ధ విమానాల్లో మూడింటిని కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ ప్రకటనపై రష్యా స్పందన వెలువడలేదు. దీంతో ఈ ప్రకటన నిజమై ఉంటుందని తెలుస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలైన తొలిరోజు నుంచే రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వీటిని రష్యా పలుమార్లు ఖండిస్తూ వచ్చింది. అయితే ఉక్రెయిన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోందని యుద్ధం తాజా పరిస్ధితి గమనించిన వారికీ అర్ధమవుతూనే ఉంది.

మరోవైపు ఉక్రెయిన్ లోని అన్ని నగరాల్లోనూ ప్రభుత్వం వైమానిక దాడుల హెచ్చరికల్ని జారీ చేసింది. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరింది. వీలైన చోట్ల బంకర్లలోకి వెళ్లిపోవాలని కోరుతోంది. ఉక్రెయిన్ గగనతలంలో రష్యా విమానయానం తన ఉనికిని గణనీయంగా తగ్గించిందని ఉక్రెయిన్ వైమానిక దళ కమాండ్ తెలిపింది. పగటిపూట ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు మూడు రష్యా హెలికాప్టర్లను కూల్చివేసినట్లు వారు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఇవాళ మరోసారి వీడియో ప్రసంగం ద్వారా పౌరులతో మాట్లాడారు. ఇవాళ తెల్లవారుజామున ఓడరేవు నగరం మారియుపోల్ ముట్టడి రష్యా దళాలు చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి చరిత్రలో నిలిచిపోతుందని జెలెన్ స్కీ అన్నారు. శాంతియుత నగరానికి ఇలా చేయడం, ఆక్రమణదారులు చేసిన పని, రాబోయే శతాబ్దాలపాటు గుర్తుండిపోయే భయంకరమైనదిగా జెలెన్ స్కీ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications