వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ యుద్ధం: పుతిన్‌ మనసులో ఏముంది? పాశ్చాత్య దేశాల ఊహకు అందని రష్యా అధ్యక్షుడి ఆలోచనలు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, తనదైన ప్రపంచంలోనే చిక్కకుపోయారని పశ్చిమ దేశాల గూఢచారులు నమ్ముతున్నారు. ఈ అంశం వారికి ఆందోళన కలిగిస్తోంది.

వారంతా సంవత్సరాల పాటు పుతిన్ ఆలోచనల్లోకి ప్రవేశించి ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

యుక్రెయిన్‌లో రష్యా బలగాలు చిక్కుకుపోయినట్లు కనిపిస్తోన్న నేపథ్యంలో ఆయన మనసును చదవడం వారికి మరింత అవశ్యంగా మారింది. ఒత్తిడిలో పుతిన్ ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుత సంక్షోభం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకునేందుకు ఆయన మెదడులోని ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

పుతిన్ అనారోగ్యం బారిన పడ్డారనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఆయన ఏకాంతంగా ఉంటున్నారని చాలామంది విశ్లేషకులు నమ్ముతున్నారు.

ఆయన నిర్వహిస్తోన్న సమావేశాలను గమనిస్తే పుతిన్ ఒంటరిగా ఉంటున్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. యుద్ధం సందర్భంగా తన జాతీయ భద్రతా బృందంతో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్‌తో సమావేశాల సమయంలో ఇది కనిపించింది.

పుతిన్ ప్రారంభ సైనిక ప్రణాళిక ఒక కేజీబీ అధికారి రూపొందించినట్లు ఉందని పశ్చిమ నిఘా వర్గాలకు చెందిన ఒక అధికారి వివరించారు.

''గోప్యతకు ప్రాధాన్యమిస్తూ అత్యంత కుట్రపూరితంగా దీన్ని రూపొందించారు. కానీ ఫలితం మాత్రం గందరగోళంగా వచ్చింది. ఈ చర్యకు రష్యా మిలిటరీ కమాండర్లు సిద్ధంగా లేరు. కొంతమంది సైనికులు, అసలు ఏం జరుగుతుందనే దానిపై కనీస అవగాహన లేకుండానే సరిహద్దులకు వెళ్లారు'' అని ఆయన చెప్పారు.

ఏకైక నిర్ణేత

చాలామంది రష్యా నాయకుల కంటే కూడా ఆ సైనిక ప్రణాళికల గురించి పశ్చిమ దేశాల గూఢచారులకే అధిక సమాచారం ఉంది. విశ్వసనీయ మూలాల ద్వారా గూఢచారులు ఈ సమాచారం తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు వారికి మరో సవాలు ఎదురైంది. అదేంటంటే పుతిన్ తదుపరి ఏం చేయనున్నారో అర్థం చేసుకోవడం. ఇది అర్థం చేసుకోవడం అంత సులభమేం కాదు.

''క్రెమ్లిన్ ఎత్తుగడలను అర్థం చేసుకోవడంలో ఎదురయ్యే పెద్ద సవాలు ఏంటంటే... అక్కడ పుతిన్ ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని తెలుసుకోవడం చాలా కష్టం'' అని గతంలో సీఐఏ రష్యా కార్యకలాపాలను పర్యవేక్షించిన జాన్ సైఫర్ అన్నారు.

బహిరంగ ప్రకటనల ద్వారా తరచుగా ఆయన ఉద్దేశాలు బహిర్గతం అవుతుంటాయి. అయినప్పటికీ వాటిపై ఆయన ఎలా స్పందిస్తారో తెలుసుకోవడం నిఘా వర్గాలకు చాలా కష్టమైన సవాలు.

''తమ నాయకుడు ఏం ఆలోచిస్తున్నారో రష్యన్లకే తెలియదు. అలాంటప్పుడు ఇతరులు దాని గురించి తెలుసుకోవడం చాలా కష్టం'' అని బీబీసీతో బ్రిటన్ ఎంఐ6 మాజీ హెడ్ సర్ జాన్ సావర్స్ చెప్పారు.

''పుతిన్, తాను ప్రత్యేకంగా తయారుచేసుకున్న బబుల్‌లో ఒంటరిగా ఉంటున్నారు. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాదు. ముఖ్యంగా ఆయన ఆలోచనలను సవాలు చేసే సమాచారం బయటకు పొక్కదు'' అని ఇంటలిజెన్స్ అధికారులు అంటున్నారు.

''ఆయన కేవలం కొంతమంది మాటలను మాత్రమే వింటారు. అంతకుమించి మిగతా వాటన్నింటిని అడ్డుకుంటారు. అందువల్లే ప్రపంచం గురించి ఆయన విచిత్రమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఆయనను ప్రభావితం చేసే సమూహం గురించి మేం తెలుసుకోవాలి అనుకుంటున్నాం'' అని సైకాలజీ ప్రొఫెసర్ అడ్రియాన్ ఫుర్హామ్ అన్నారు. ఆయన 'ద సైకాలజీ ఆఫ్ స్పైస్ అండ్ స్పైయింగ్' అనే పుస్తకానికి ఆయన సహ రచయిత కూడా.

పుతిన్ మాట్లాడేవారి సంఖ్య పెద్దగా ఏం ఉండదు. యుక్రెయిన్‌పై దాడి నిర్ణయానికి సంబంధించి ఆయన సంప్రదించిన వ్యక్తుల సంఖ్య మరింత తక్కువగా ఉంటుందని పశ్చిమ దేశాల నిఘా అధికారులు నమ్ముతున్నారు. వీరంతా పుతిన్‌కు నిజమైన విశ్వాసకులుగా ఉంటారు. కేవలం వీరితోనే పుతిన్ తన ఉద్దేశాలను పంచుకుంటారు అని వారు భావిస్తున్నారు.

దండయాత్రకు ముందు జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో తన సొంత 'ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్' అధిపతిని పుతిన్ బహిరంగంగా మందలించారు. ఇది ఆ అధికారిని అవమానపరిచినట్లుగా అనిపించింది. దీన్ని బట్టి ఆయన అంతర్గత పరిధి ఎంత తక్కువగా ఉందో అర్థం అవుతుంది.

1990లలో రష్యాకు ఎదురైన అవమానాన్ని అధిగమించాలనే కోరిక ఆయనలో బలంగా ఉంది. దీనితో పాటు రష్యాను అణచివేసి తనను అధికారం నుంచి తరిమి కొట్టాలని పశ్చిమ దేశాలు నిశ్చయించుకున్నాయని పుతిన్ భావిస్తున్నట్లు ఆయనను బాగా గమనించిన వారు చెప్పారు.

పుతిన్‌ను కలిసిన ఒక వ్యక్తి ఆయన ఆసక్తుల గురించి చెప్పారు. లిబియా కల్నల్ గడాఫీని చంపిన వీడియోలను చూడటం పట్ల పుతిన్ ఆసక్తి కనబరుస్తారని ఆ వ్యక్తి గుర్తు చేసుకున్నారు.

పుతిన్ మానసిక స్థితిని అంచనా వేయాలని సీఐఏ డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ను అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు. ''చాలా ఏళ్లుగా పుతిన్ మనోవేదన, ఆశయం కలగలిసిన ఒక స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన ఉద్దేశాలు చాలా కఠినమైనవి. ఇంకో కోణంలో చూస్తే ఆయన మరింత ఏకాకిగా మారారు'' అని విలియం వివరించారు.

రష్యా అధ్యక్షునికి పిచ్చి పట్టిందా? పశ్చిమ దేశాల్లో చాలామంది ఈ ప్రశ్న అడిగారు. ''యుక్రెయిన్‌పై దాడి వంటి నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇలా పొరబడ్డారని, ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న వ్యక్తిని మనం 'పిచ్చివారి'గా పరిగణిస్తామని'' ఒక సైకాలజిస్టు అన్నారు.

విదేశీ నిర్ణయాధికారులపై నాయకత్వ విశ్లేషణ చేసేందుకు సీఐఏ వద్ద ఒక బృందం ఉంటుంది. ఈ బృందం రహస్య నిఘా వర్గాల ద్వారా వారి నేపథ్యాన్ని, సంబంధాలను అధ్యయనం చేస్తుంది.

పుతిన్ మరో ప్రపంచంలో జీవిస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఏంగెలా మెర్కెల్ 2014లో అన్నారు. ఇటీవల పుతిన్‌తో భేటీ అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ''మునుపటి భేటీలతో పోలిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ 'మరింత దృఢంగా, మరింత ఐసోలేటెడ్‌గా' మారిపోయారనే'' నివేదికలు అందాయి.

పుతిన్‌లో ఏదైనా మార్పు వచ్చిందా? ఎలాంటి రుజువులు లేకుండానే కొంతమంది ఆయన అనారోగ్యం బారిన పడ్డారనే ఊహాగానాలు చేస్తున్నారు. మరికొంతమంది ఆయన మానసిక పరిస్థితిపై దృష్టి సారిస్తున్నారు. రష్యా ఘనతను పునరుద్ధరించాలనే మానసిక భారాన్ని ఆయన మోస్తున్నారని అనుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇది కూడా ఆయన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి ఉండొచ్చు.

''పుతిన్‌కు ఎలాంటి మానసిక రుగ్మతలు లేవు, ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. అయినప్పటికీ ఆయన చాలా తొందరపడుతున్నారు'' అని యూఎస్ ప్రభుత్వ మాజీ ఫిజీషియన్, దౌత్యవేత్త కెన్ డెక్లెవా అన్నారు. జార్జ్ డబ్ల్యూహెచ్ బుష్ ఫౌండేషన్ ఫర్ యూఎస్-చైనా రిలేషన్స్‌లో కెన్ ప్రస్తుతం పనిచేస్తున్నారు.

కానీ ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటికీ పుతిన్‌కు విశ్వసనీయమైన సమాచారం అందట్లేదు. దండయాత్ర ప్రారంభానికి ముందు కూడా పుతిన్‌కు నచ్చని, ఆయన వినడానికి ఇష్టపడని అంశాలను చెప్పడానికి అతని నిఘా సర్వీసులు చొరవ చూపి ఉండకపోవచ్చు.

''తన సొంత బలగాలు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయో పాశ్చాత్య నిఘా వర్గాలకు తెలిసినంత కూడా ఇప్పటికీ పుతిన్‌ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు'' అని ఒక పాశ్చాత్య అధికారి అన్నారు.

పుతిన్

పిచ్చివాడి సిద్ధాంతం

బాలుడిగా ఉన్నప్పుడు తాను ఒక ఎలుకను వెంబడించిన కథ గురించి పుతిన్ స్వయంగా చెబుతుంటారు. ఎలుకను ఒక మూలకు తరిమినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అది ఎదురుతిరిగిందని, అప్పుడు తాను పారిపోయానని ఆయన చెప్పారు. ఇప్పుడు పశ్చిమ దేశాల పాలసీ మేకర్లు అడుగుతోన్న ప్రశ్న ఏంటంటే... తాను ఇప్పుడు ఒక మూలలో ఇరుక్కుపోయినట్లు పుతిన్ భావిస్తే పరిస్థితి ఏంటి?

యుద్ధం నేపథ్యంలో పుతిన్ రసాయన ఆయుధాలను, వ్యూహాత్మక అణ్వస్త్రాలను ఉపయోగించవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

చాలా ప్రముఖమైన 'మ్యాడ్‌మ్యాన్' థియరీ విధానాన్ని పుతిన్ అనుసరించవచ్చు. తనను తానే ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రపంచానికి చాటి చెప్పుకోవచ్చు. మ్యాడ్‌మాన్ సిద్ధాంతం ప్రకారం, అణ్వాయుధాలు కలిగి ఉండే దేశాధిపతి, ప్రత్యర్థిని ఒప్పించడం ద్వారా లాభపడొచ్చు. లేదా ప్రపంచానికి వినాశనం కలిగిస్తుందని తెలిసినప్పటికీ అణ్వాయుధాలు ఉపయోగించే వెర్రివాడిగానూ మారిపోవచ్చు.

ఇప్పుడు పుతిన్ ఉద్దేశాలను, మనస్తత్వంపై అంచనాలు వేయడం అంత కీలకం కాదు. ఆయన ప్రమాదకరమైన చర్యలకు సిద్ధపడకుండా నిరోధించడంపై పాశ్చాత్య గూఢచారులు, పాలసీ మేకర్లు పనిచేయడం చాలా ముఖ్యం.

''వైఫల్యాలను, బలహీనతలను అంగీకరించేందుకు పుతిన్ ఇష్టపడరు. తనను ఒక మూలకు నెట్టివేసినట్లుగా లేదా తాము బలహీనపడినట్లుగా పుతిన్ భావిస్తే, ఆయన మరింత ప్రమాదకరంగా మారతారు. కాబట్టి ఎలుకను ఇరుకున పెట్టడం కంటే, అడవిలోకి వెళ్లేలా దారి వదలడమే ఉత్తమం'' అని కెన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine war: What's on Putin's mind? Russian President's ideas are beyond the imagination of Western countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X