World War 3: సారీ చెప్పు! మీడియా ముందే ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదం
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమీర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)వైట్ హౌస్‌లో శుక్రవారం భేటీ అయ్యారు. ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. శాంతి చర్చల సమయంలో తమ భూభాగంపై దాడి చేసిన 'హంతకుడి'(రష్యా)తో ఎలాంటి రాజీ ఉండకుండా చూడాలని ట్రంప్‌ను కోరినట్లు తెలిపారు. అయితే, ఇందుకు ట్రంప్ సమాధానిస్తూ.. రష్యాతో సంధి కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ రాజీ పడాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడొద్దని ట్రంప్ హితవు పలికారు.

కాగా, మీడియా సమావేశంలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓవల్ ఆఫీసు ఆహ్వానాన్ని నిరాకరించడంతో జెలెన్‌స్కీపై డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మండిపడ్డారు. అలా చేస్తే మీ గౌరవం ఏమైనా తగ్గుతుందా? అని ధ్వజమెత్తారు. ఇందుకు జెలెన్‌స్కీ క్షమాపణలు చెప్పాలంటూ ట్రంప్, వాన్స్ డిమాండ్ చేశారు. అంతేగాక, మూడో ప్రపంచ యుద్ధం అంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్రంప్.. జెలెన్‌స్కీపై అసహనం వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని ట్రంప్.. జెలెన్‌స్కీకి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఖనిజాలతోపాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. మొదట ఇందుకు అంగీకరించని ఉక్రెయిన్.. తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
Wow, Vance and Trump are attacking Zelenskyy in the Oval Office pic.twitter.com/sISxqmgiYh
— Acyn (@Acyn) February 28, 2025
'ఉక్రెయిన్-రష్యా యుద్ధం తప్పుడు దిశలో సాగుతోంది. మేము రష్యాతో చర్చలు జరిపాము. ఉక్రెయిన్- రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి ఉంటుంది' అని జెలెన్‌స్కీకి ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నన్ను శాంతికర్తగా గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రాణాలను కాపాడటానికి నేను ఇదంతా చేస్తున్నాను. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అది తప్పుడు దిశలో వెళుతోంది అని ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
మూడేళ్ల యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడం, రష్యాతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడం, ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంలో అయిన ఖర్చులను తిరిగి పొందడంపై ట్రంప్ దృష్టి సారించారు. ఈ చర్చల సందర్భంగా అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడంపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు, ఆయుధాలు, సైనిక రంగాలతో సహా వివిధ రంగాలకు ఈ ఖనిజాల వ్యూహాత్మక ప్రయోజనాలను వివరించారు.












Click it and Unblock the Notifications