షాకింగ్: లెగ్గింగ్స్ వేసుకున్నారని అమ్మాయిలను విమానం ఎక్కనీయలేదు!

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఇటీవలి కాలంలో విమానయాన సంస్థలు వింత వింత రూల్స్ అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో విమానాలను ఎక్కనీయకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఇద్దరు అమ్మాయిలను యూనైడెట్ ఎయిర్‌లైన్స్ తమ విమానంలోకి ఎక్కకుండా అడ్డుకుంది. దీనికి కారణంగా వారు లెగ్గింగ్స్ ధరించడే. ఇలాంటి చిన్న కారణానికి కూడా విమానం ఎక్కనీయకపోవడంతో సదరు విమానయాన సంస్థపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

us plane

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని డెన్వర్‌ నుంచి మిన్నెపోలిస్‌కు వెళ్తున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణించేందుకు ఇద్దరు అమ్మాయిలకు అనుమతి ఇవ్వలేదు. గ్రే కలర్‌ లెగ్గింగ్‌ వేసుకున్న మరో అమ్మాయిని సిబ్బంది వేరే డ్రెస్‌ మార్చుకొని రావాలని లేదా లెగ్గింగ్స్‌పై మరో డ్రెస్‌ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ అమ్మాయి తన బ్యాక్‌ప్యాక్‌లో నుంచి వేరే డ్రెస్‌ తీసుకుని లెగ్గింగ్స్‌పై వేసుకోవడంతో ఆమెను విమానం ఎక్కనిచ్చారు.

అయితే, తమ వద్ద మరో డ్రెస్‌ లేదని చెప్పినా వినకపోవడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు వెనుదిగిరి వెళ్లిపోయారు. డెన్వర్‌ విమానాశ్రయంలో జరుగుతున్న ఈ ఘటనను గమనించిన షాన్నాన్‌ వాట్స్‌ అనే మహిళ జరిగిన విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మహిళల దుస్తుల విషయంలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అలా ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు.

ఆమె ట్వీట్లపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా తీవ్రంగానే స్పందించింది. సరైన దుస్తులు ధరించని ప్రయాణికులను తిరస్కరించే హక్కు ఎయిర్‌లైన్స్‌కు ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది సౌకర్యం, భద్రత కోసం చెప్పులు లేకుండా, సరైన దస్తులు ధరించకుండా వచ్చిన ప్రయాణికులను విమానం ఎక్కకుండా ఆపొచ్చని స్పష్టం చేసింది.

అయితే, 'సరైన దుస్తులు' అంటే ఎలాంటివి అనే విషయాన్ని మాత్రం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించకపోవడం గమనార్హం. వెనుదిరిగిన ఇద్దరు అమ్మాయిలు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి పాస్‌పై వచ్చారని ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి జొనాథన్‌ తెలిపారు.

సాధారణ ప్రయాణికులు లెగ్గింగ్స్‌, యోగా ప్యాంట్స్‌ వేసుకున్నా కూడా అనుమతి ఇస్తామని, కానీ పాస్‌పై ప్రయాణించే వారు మాత్రం కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. కాగా, అమ్మాయిలను విమానం ఎక్కనీయకపోవడంతో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తీరుపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
United Airlines has been heavily criticised on social media after two girls were reportedly barred from flying for wearing leggings.
Please Wait while comments are loading...