రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరి ఇదే: భద్రతమండలిలో కుండబద్దలు కొట్టిన ప్రతినిధి
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో- అంతర్జాతీయ స్థాయి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన అనంతరం అమెరికా రంగంలోకి దిగింది. ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన.. అమెరికాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

భద్రత మండలి కీలక భేటీ..
అప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి పిలుపునిచ్చింది అమెరికా. ఈ మేరకు సమితికి లేఖ రాసింది. ఉక్రెయిన్ సంక్షోభంపై భద్రత మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్య సమితికి అధికారికంగా లేఖలను రాసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, అల్బేనియా ఉన్నాయి. ఆ వెంటనే భద్రత మండలి సమావేశమైంది. అమెరికా, భారత్, రష్యా, ఉక్రెయిన్, మెక్సికో, చైనా, బ్రెజిల్, నార్వే, ఫ్రాన్స్, సహా శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల రాయబారులు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

అదే అజెండాతో..
ఈ భేటీ అజెండాను కూడా ఖరారు చేసింది అమెరికా. ఉక్రెయిన్ సంక్షోభ నివారణ, డొనెట్స్క్-లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రీజియన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రకటన చేసిన రష్యాపై ఆంక్షలను విధించడం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానంగా ఇందులో చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తరఫున తన విధానాన్ని ఆయన స్పష్టం చేశారు.

భారతీయుల రక్షణకే అధిక ప్రాధాన్యత..
ఉక్రెయిన్‌లో వేలాదిమంది భారతీయులు నివసిస్తోన్నారని, వారికి రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని టీఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని వేర్వేరు నగరాలు, రీజియన్లలో 20 వేల మందికి పైగా తమదేశ విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో భారత పౌరులు నివసిస్తున్నారని, వారికి రక్షణను కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉక్రెయిన్ పౌరుల భద్రత కూడా ముఖ్యమేనని అన్నారు.

సంయమనం పాటించాల్సిందే..
రష్యా-ఉక్రెయిన్ వ్యవహారంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని టీఎస్ తిరుమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాల మధ్య కొద్దిరోజులుగా చెలరేగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంపై అన్ని దేశాలు దృష్టి సారించాలని సూచించారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గితే- పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. దౌత్యనీతి, రాజనీతిజ్ఞత, పరస్పర చర్చలతోనే ఇది సాధ్యపడుతుందని, డిప్లొమేటిక్‌గానే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications