ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నాయి. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది.
ఈ పరిణామాల మధ్య భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ అయిన ఓ ట్వీట్ కలకలం రేపుతోంది. వంచకులతో కలిసి ఘనీ బాబా (ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ) దేశం విడిచి పారిపోయాడని, దేశ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునేలా చేశాడని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఒక దేశాధ్యక్షుడు చివరికి పారిపోవడం పట్ల ప్రపంచ దేశాలకు తాము క్షమాపణలు చెబుతున్నామని అందులో పొందుపరిచారు. ఆ దేశద్రోహిని అల్లా కఠినంగా శిక్షించాలని రాశారు. అష్రఫ్ ఘనీ పరిపాలన కాలం తమ దేశానికి మాయని మచ్చగా అభివర్ణింంచారు.

దేశ రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో అదే దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ కనిపించడం దుమారం రేపింది. కొద్దిసేపటి తరువాత ఆ ట్వీట్‌ను రాయబార కార్యాలయం అధికారులు తొలగించారు. ఈ పోస్ట్ ఎలా వచ్చింది?, ఎవరు చేశారు? అనే విషయం ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం ప్రెస్ కార్యదర్శి అబ్దుల్ హక్ అజాద్ వివరణ ఇచ్చారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు తెలిపారు. తాను కూడా ట్విట్టర్ హ్యాండిల్ యాక్సెస్‌ను పొందలేకపోయానని వివరించారు. తన స్నేహితుడొకరు అష్రఫ్ ఘనీపై చేసిన వ్యాఖ్యలతో కూడిన స్క్రీన్ షాట్‌ను పంపించారని తెలిపారు. తాను పలుమార్లు యాక్సెస్ పొందడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదని అబ్దుల్ హక్ అజాద్ పేర్కొన్నారు. తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్.. హ్యాక్‌కు గురైనట్లు కనిపిస్తోందని అన్నారు. ఆ ట్వీట్‌ను తొలగించినట్లు తెలిపారు. ఆ ట్వీట్లను ఎవరూ విశ్వసించవద్దని అబ్దుల్ హక్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications