డొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్‌లో జో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక అట్టే సమయం లేదు. ఇంకో రెండు రోజులే. ఈ నెల 3వ తేదీన తమ దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు అమెరికన్లు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి అవకాశం ఇస్తారా? లేక జో బిడెన్‌కు పట్టం కడతారా? అనేది ఇంకో 72 గంటల్లో తేలిపోతుంది. ఈ పరిస్థితులు విజయం ఎవరిని వరిస్తుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కన్నేశాయి. నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికన్లు ఎవరికి ఓటు వేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది.

ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లో జో లీడ్..
రిపబ్లికన్లకు కంచుకోటల్లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ సారి డెమోక్రాట్ల వశం అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ సీఎన్ఎన్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో ఈ సారి డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది. అమెరికా ఎగువ మధ్య తూర్పు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించిన రాష్ట్రాల్లో ఈ సారి డెమొక్రాట్లు లీడ్ సాధించారని పేర్కొంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) కొంత మేర ప్రభావం చూపడం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది.

విస్కాన్సిన్, మిచిగాన్‌లల్లో..
ఎన్నికల ప్రచారం ముగిసిన అప్పర్ మిడ్ ఈస్ట్ రీజియన్‌లోని కొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్లు లీడ్‌లో ఉన్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. విస్కాన్సిన్, మిచిగాన్‌లల్లో జో బిడెన్ ముందంజలో ఉండగా.. అరిజోనా, నార్త్ కరోలినాల్లో డొనాల్డ్ ట్రంప్-జో బిడెన్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొని ఉందని పేర్కొంది. 2016 ఎన్నికల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సారి గాలి మారిందని, ట్రంప్‌కు వ్యతిరేకంగా వీస్తోందని సీఎన్ఎన్ అంచనా వేసింది.

ర్యాండమ్ శాంపిల్..
అరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌లల్లో కిందటి నెల 23 నుంచి 30వ తేదీ వరకు సీఎన్ఎన్.. టెలిఫోన్ ద్వారా ఈ సర్వే చేపట్టింది. ఒక్కో రాష్ట్రం నుంచి వెయ్యిమంది వరకు స్థానికుల అభిప్రాయాలను సేకరించింది. అరిజోనాలో 50 శాతం మంది జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. డొనాల్డ్ ట్రంప్‌నకు 46 శాతం మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. విస్కాన్సిన్‌లో జో బిడెన్-52, ట్రంప్-44 శాతం మేర ఓట్ల షేరింగ్ నమోదైనట్లు పేర్కొంది.

నార్త్ కరోలినా.. మిచిగాన్‌లల్లో అదే తీరు..
నార్త్ కరోలినాలో ట్రంప్‌కు 45 శాతం మంది బిడెన్‌కు 51 శాతం మంది మద్దతు ప్రకటించినట్లు వెల్లడించింది. మిచిగాన్‌లో ఈ తేడా భారీగా ఉంటోంది. జో బిడెన్-53 శాతం, ట్రంప్-41 శాతం మేర మద్దతును కూడగట్టుకున్నట్లు తేలింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 2016లో డొనాల్డ్ ట్రంప్ మెజారిటీని సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలింగ్ సమయానికి ఓటర్లు తమ ఓటును ఎవరికి వేస్తారనేది ఖచ్చితంగా అంచనా వేయలేమని స్పష్టం చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. తమ సర్వే కోసం ఆర్థిక పరిస్థితులు, కరోనా వైరస్ నియంత్రణ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది.












Click it and Unblock the Notifications