అమెరికా ఎన్నికల్లో భారతీయుల హవా- ప్రతినిధుల సభకు రాజాకృష్ణమూర్తి ఎన్నిక- హ్యాట్రిక్ వీరుడు
అమెరికా ఎన్నికల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు భారతీయులు అమెరికా ఎన్నికల్లో సత్తా చూపుతుండగా.. తాజాగా యూఎస్ ప్రతినిధుల సభకు భారతీయ మూలాలున్న రాజా కృష్ణమూర్తి మరోసారి ఎన్నికయ్యారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న పలువురు అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు.
47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో లైబర్టేరియన్ పార్టీ అభ్యర్ధి ప్రెస్టన్ నెల్సన్‌పై భారీ తేడాతో గెలుపొందారు. మొత్తం పోలయిన ఓట్లలో రాజా కృష్ణమూర్తికి 71 శాతం ఓట్లు లభించడం విశేషం. ఇప్పటికే రెండుసార్లు ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించిన రాజా కృష్ణమూర్తి.. వరుసగా మూడో గెలుపు అందుకోవడంతో భారతీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కృష్ణమూర్తి తల్లితండ్రులది తమిళనాడు కాగా.. ఆయన మాత్రం ఢిల్లీలో పుట్టి పెరిగారు. అనంతరం యూఎస్ వలస వెళ్లారు. 2016లో కృష్ణమూర్తి తొలిసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

మరో ఇద్దరు భారతీయులు అమీ బేరా, ఆర్‌వో ఖన్నా కూడా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో అమీ బేరా నాలుగుసార్లు గెలిచి ఐదోసారి విజయం కోసం రంగంలో ఉన్నారు. అలాగే ఖన్నా రెండుసార్లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాషింగ్టన్ నుంచి ప్రతినిధుల సభకు మరో భారతీయురాలు ప్రమీలా జైపాల్ కూడా పోటీలో ఉన్నారు.

అరిజోనా నుంచి మరో భారతీయురాలు డాక్టర్ హీరల్ తిపిర్నేని రేసులో ఉన్నారు. టెక్సాస్‌లో డెమోక్రాట్ అభ్యర్ధి శ్రీ కులకర్ణి ప్రత్యర్ధి రిపబ్లికన్ అభ్యర్ధి ట్రాయ్ నెల్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నట్లు తాజా వార్తలు చెబుతున్నాయి. వర్జీనియాలో రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న మంగ అనంతాత్ముల మాత్రం ప్రత్యర్ధి డెమోక్రాట్ అభ్యర్ధి కంటే వెనుకబడ్డారు.












Click it and Unblock the Notifications