అమెరికాలో ఉన్మాదం: ఏడుగుర్ని చంపి వ్యక్తి ఆత్మహత్య
లాస్ ఏంజిల్స్: ఆమెరికాలో మరోసారి ఘోరం జరిగింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక కళాశాల వద్ద సాయుధ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. శాంతా బార్బరా కౌంటీ షరీఫ్ బిల్ బ్రౌన్ శనివారం విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

శాంతా బార్బరాలోని ఇస్లా విస్టాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ క్యాంపస్ వద్ద శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి సామూహిక హత్యాకాండకు పాల్పడినట్టు తెలుస్తోందని చెప్పారు.
మృతుల్లో ఆగంతుకుడు కూడా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. నల్లరంగు బిఎండబ్ల్యు కారులో వచ్చిన దుండగుడు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పాదచారులపై కాల్పులు జరిపాడని, తర్వాత అతను కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి 9.30కు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారని, పోలీసులపై రెండుసార్లు కాల్పులు జరిపిన నిందితుడు తర్వాత అక్కడ నిలిపివున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడన్నారు. తర్వాత అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు తలపై బుల్లెట్ గాయంతో నిందితుడు కూడా మరణించినట్టు ధృవీకరించారని బ్రౌన్ వివరించారు.
నల్లటి బిఎండబ్ల్యూ కారులో ప్రయాణించిన ఆ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతడు కాల్పులు జరపడానికి ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే తుపాకీతో అతను తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications