అంతరిక్షంలో ఆయుధాలతో అమెరికా.. తొలిసారి బయటపెట్టిన యూఎస్
ఇన్నాళ్లూ కేవలం హాలీవుడ్ సినిమాల్లోనే చూసిన 'స్పేస్ వార్' ఇప్పుడు నిజరూపం దాల్చింది. నింగిలో తమ సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ అమెరికా మిలిటరీ చరిత్రలోనే ఒక సంచలన ప్రకటన చేసింది. అంతరిక్ష కక్ష్యలో శత్రు దేశాల దాడులను తిప్పికొట్టే అధునాతన ఆయుధాలను అమర్చినట్లు అమెరికా రక్షణ శాఖ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది.
నింగిలో చైనా, రష్యాలు తమ సైనిక కదలికలను ముమ్మరం చేస్తున్న వేళ, అగ్రరాజ్యం చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. విశ్వంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అమెరికా వేసిన ఈ అడుగు, రాబోయే రోజుల్లో కొత్త రకం అంతరిక్ష యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

రహస్య కవచం.. బెదిరింపులకి చెక్!
మేరీల్యాండ్‌లో జరిగిన ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ ఈ సంచలన విషయాలను వెల్లడించారు. అంతరిక్షంలో తమ దళాలను రక్షించుకునేందుకు, శత్రువుల ఆట కట్టించేందుకు కావాల్సిన 'స్పేస్ కంట్రోల్' ఆయుధాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆయన ధృవీకరించారు. అయితే ఆ ఆయుధం రూపురేఖలు ఎలా ఉంటాయి? దాని పనితీరు ఏంటి? అనే విషయాలను మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. శత్రు దేశాలను భయపెట్టి దాడులకు దిగకుండా ఉండేందుకే ఈ విషయాన్ని బయటపెట్టామని, ఆయుధ రహస్యాలను పూర్తిగా బయటపెడితే ఆ వ్యూహాత్మక ప్రయోజనం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు.
'గోల్డెన్ డోమ్' దిశగా వేగంగా అడుగులు!
అమెరికా చేపట్టిన ఈ రహస్య ప్రాజెక్ట్ వెనుక వారి ప్రతిష్టాత్మక మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ 'గోల్డెన్ డోమ్' ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. శత్రువులు ప్రయోగించే క్షిపణులను అంతరిక్షంలోనే గుర్తించి ధ్వంసం చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే స్పేస్ బేస్డ్ ఇంటర్‌సెప్టార్స్ సిద్ధమైనట్లు సమాచారం. అంతరిక్షంలో అమెరికా తన ఆర్థిక, సైనిక కార్యకలాపాలను ఎవరి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించుకోవడమే తమ ప్రాథమిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. శత్రు ఉపగ్రహాల కమ్యూనికేషన్‌ను జామ్ చేయడం నుంచి సైబర్ దాడులు, అవసరమైతే ప్రత్యక్షంగా కూల్చేయడం వరకు ఈ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సరికొత్త ఆయుధ పోటీ.. ఊహించని ముప్పు?
అమెరికా చేసిన ఈ ప్రకటన అంతరిక్ష భద్రతా నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అగ్రరాజ్యం బహిరంగంగా ఆయుధాలు ఉన్నాయని చెప్పడం వల్ల చైనా, రష్యాలు కూడా తమ ఆయుధ సమృద్ధిని ప్రదర్శించేందుకు సిద్ధపడతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నింగిలో ఆయుధ పోటీ పెరిగిపోయి, ఎవరైనా ఒక్క చిన్న పొరపాటు చేసినా మహా యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని స్పేస్ సెక్యూరిటీ నిపుణులు విక్టోరియా సామ్సన్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలు కూడా తమ వద్ద ఉన్న స్పేస్ వెపన్స్ ప్రాజెక్టులను సమర్థించుకోవడానికి అమెరికా ప్రకటన ఒక పెద్ద ఊతంగా మారబోతోందనడంలో సందేహం లేదు.














Click it and Unblock the Notifications
