మీ ఉద్యోగం పోయింది: టెక్కీలకు దడ పుట్టించిన మెయిల్
ఐటీ దిగ్గజం ఒరాకిల్.. టెక్కీలకు భారీ షాక్ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒకే ఒక్క ఈమెయిల్ ద్వారా ఉద్యోగులను తొలగించింది. "Today is your last working day.. " అంటూ వచ్చిన మెయిల్ పంపింది. సంస్థలో చోటు చేసుకుంటోన్న అంతర్గత మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు లేఆఫ్స్ కు గురి అయిన టెక్కీలందరికీ కూడా తెల్లవారు జామున 6 గంటలకే ఈ మెయిల్స్ అందాయి. ఈ పరిణామం.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తీవ్రతను చాటిచెప్పినట్టయింది.
రోజూలాగే విధుల్లో చేరడానికి లాగిన్ అవుతున్న సమయంలో తెల్లవారు జామున 6 గంటలకే ఒరాకిల్ నుండి ఉద్యోగులకు మెయిల్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఈ టెక్ దిగ్గజం మలివిడత లేఆఫ్స్ పై దృష్టి సారించినట్లు ఇదివరకే వార్తలొచ్చాయి. సెప్టెంటర్ మొదటి లేదా రెండో వారంలో మరో విడతలో భారీగా టెక్కీలను తొలగించే అవకాశాలను పరిశీలిస్తోందనేది వాటి సారాంశం. అదే ఇప్పుడు వాస్తవరూపాన్ని దాల్చింది.

ఇప్పటికే 21,000 మందిని తొలగించిందా సంస్థ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస లేఆఫ్స్ చోటు చేసుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది కూడా 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒరాకిల్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరింంచుకుంటోంది. ఇందుకోసం సంస్థ భారీగా నిధులను మళ్లిస్తోంది. ఇదే లేఆఫ్స్‌కు దారితీసిందనే అంచనాలు ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాన్ని విస్తరించడానికి ఒరాకిల్ దాదాపు 55.7 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడుల కోసం నిధులను కేటాయించింది. భవిష్యత్ అవసరాల కోసం మరింత రుణాన్ని కూడా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. దీనివల్ల ఒరాకిల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో ఏకంగా 77 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయినప్పటికీ.. ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోండటం, క్యాష్ ఇన్ ఫ్లో ఖర్చులు సంస్థ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు.
లేఆఫ్స్ కు గురైన వారికిపరిహారం అందజేయనున్నట్లు ఒరాకిల్ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డాక్యుసైన్ ప్లాట్ ఫామ్ ద్వారా పంపిస్తామని, వాటిపై సంతకం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కంపెనీ తన భద్రతా చర్యలను కఠినతరం చేసింది. ఉద్యోగులకు సంబంధించిన ఒరాకిల్ కంప్యూటర్, ఈమెయిల్, వాయిస్‌మెయిల్, ముఖ్యమైన ఫైల్స్ యాక్సెస్‌లను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది.
కంపెనీకి చెందిన ఎలాంటి సమాచారాన్ని కాపీ గానీ, డౌన్‌లోడ్ చేయడం గానీ, వ్యక్తిగత ఈమెయిళ్లకు పంపడం గానీ చేయకూడదని సూచించింది. ఉద్యోగులు తమకు గల ఏవైనా అనుమానాలు ఉంటే Ask HR పేజీ ద్వారా లేదా నిర్దేశిత ఫోన్ నంబర్ ద్వారా హెచ్ఆర్ టీమ్‌ను సంప్రదించవచ్చని ఒరాకిల్ తెలిపింది.














Click it and Unblock the Notifications
