ఏపీకి కూల్ న్యూస్, మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
పెరిగిన ఎండల వేళ వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొంత ఊరట నిచ్చే సమాచారం అందించింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బంగాళాఖాతం లో మరో అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు వస్తాయని తెలిపింది.
వాతావరణంలో వస్తున్న మార్పుల పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వరకు ఆకాశంలో మేఘాలు, గాలులతో ద్రోణి ఏర్పడింది. కర్ణాటకవైపు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో వర్సాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో వాతావరణం చల్లబడి.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వచ్చే మూడ్రోజులు ఏపీలోని ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు.
అదే విధంగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. మరోవైపు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షాల, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. కాగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు కురవటం ద్వారా కొంత రిలీఫ్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
