అర్ధరాత్రి భీకర యుద్ధం. తోక ముడిచిన అమెరికా! సముద్రంలో నిప్పుల వర్షం..
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. పశ్చిమాసియా తీరప్రాంతం సముద్రంలో చెలరేగిన అగ్నిగుండంగా మారిపోయింది. మొన్నటి వరకు మాటల యుద్ధంతో, రహస్య దాడులతో సాగిన అమెరికా-ఇరాన్ వైర పోరు.. ఇప్పుడు నేరుగా యుద్ధ నౌకలపై క్షిపణుల విసిరే దాకా వెళ్లింది. ఇరు దేశాలు పరస్పరం చేస్తున్న దాడులు, ప్రతిదాడులతో పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సముద్రంలో తమ నౌకలకు అడ్డుగా నిలుస్తూ ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా దళాలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్తో పాటు మరొక యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడినట్లు ప్రకటించింది. ఈ అనూహ్య దాడితో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా నౌకలు, తదుపరి దాడులకు భయపడి అక్కడి నుంచి తోక ముడిచి పారిపోయాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.

ఆయిల్ ట్యాంకర్లే టార్గెట్.. పగతో రగిలిపోతున్న ఇరాన్
ఈ ఘర్షణల వెనుక అసలు కథ ఆయిల్ ట్యాంకర్ల చుట్టూ తిరుగుతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న తమ మూడు ఇంధన ట్యాంకర్లపై అమెరికా దళాలు క్రూరంగా వైమానిక దాడులు చేశాయని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దెబ్బకు ప్రతీకారంగానే తాము కూడా రంగంలోకి దిగామని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిలో అనుమతి లేని మార్గాల్లో వెళ్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లతో పాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అమెరికా సంబంధిత నౌకలపై దాడి చేసి సమాధానం చెప్పామని ఇరాన్ బలగాలు స్పష్టం చేశాయి.
అమెరికా కౌంటర్.. అవన్నీ అబద్ధాలన్న సెంటామ్
అయితే ఇరాన్ చేస్తున్న వాదనలను అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల నుంచి తమ విమాన వాహక నౌక, డిస్ట్రాయర్ సురక్షితంగా తప్పించుకున్నాయని స్పష్టం చేసింది. తమ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని, తమ సైనికులెవరూ గాయపడలేదని ప్రకటించింది. ఇరాన్ దాడులకు నిరసనగా ఖార్గ్ ఐలాండ్, జాస్క్ తీరాల్లో ఉన్న ఇరాన్ చమురు ట్యాంకర్లను తాము పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ముందుంది తీవ్ర పరిణామాలు.. హోర్ముజ్ జలసంధిలో హై అలర్ట్
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. తమను రెచ్చగొట్టే చర్యలు ఆపకపోతే రాబోయే రోజుల్లో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో ఇరాన్ దాడులను తిప్పికొడతామని అమెరికా సంకేతాలిస్తుండటంతో, ఈ సముద్ర పోరు ఎంతటి తీవ్ర రూపం దాల్చుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.













Click it and Unblock the Notifications