అక్కడ ఈ యాప్స్ పని చేయవిక: నిషేధంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్: జాతీయ భద్రతకే ప్రాధాన్యత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన అధికారం చివరి రోజుల్లో సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. గత ఏడాది ముగిసిన ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఇంకో రెండు వారాల్లో అధ్యక్ష స్థానాన్ని ఖాళీ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన జో బిడెన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తాను దిగిపోవడానికి ముందు కొన్ని కీలకమైన ప్రతిపాదనలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన జారీ చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే విసాలకు సంబంధించిన ఉత్తర్వులను ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి చైనాకు చెందిన యాప్‌లను నిషేధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 45 రోజుల తరువాత నిషేదం అమల్లోకి వస్తుంది. అక్కడి చట్టాలకు అనుగుణంగా నిషేధాన్ని అమలు చేయడానికి నెలన్నర రోజుల గడువుు ఇస్తారు. ఈలోగా ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వారి వాదనలను వినిపించడానికి అవకాశం కల్పిస్తారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. చైనా, హాంగ్‌కాంగ్, మకావ్ ప్రధాన కేంద్రంగా పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలు రూపొందించిన ఎనిమిది యాప్‌లను నిషేధం జాబితాలో చేర్చినట్లు తెలిపారు.

తాజాగా నిషేధం వేటు పడిన యాప్‌ల జాబితాలో అలీపే, క్యామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమేట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్స్‌లు ఉన్నాయి. ఇందులో అలీపే- చైనాకు చెందిన అపర కుబేరుడు జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందినది. ఆయా యాప్‌లు అమెరికన్ పౌరులకు సంబంధించిన కీలక సమాచారాలను సేకరిస్తున్నాయనే అనుమానాలు తనకు ఉన్నాయని, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.