జెలెన్‌స్కీ- బైడెన్ చర్చలు: 500మిలియన్ డాలర్ల సాయం : రష్యా మాట తప్పింది..!!
యుద్దం ముగింపు దశకు వచ్చిందని భావించినా ఆగలేదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య చర్చల్లో కీలక ముందడుగు పడినా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మంతనాలు చేసారు. దాదాపు 55 నిమిషాల సేపు వారిద్దరి మధ్య ప్రస్తుత పరిణామాల పైన చర్చలు జరిగాయి. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు 500మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు.

రష్యా అవమానకర ప్రవర్తన
రాజధాని కీవ్ సహా చెర్నిహివ్‌ల సమీపంలో దాడులు ఆపుతామని రష్యా చేసిన ప్రకటనను తమ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, పశ్చిమ దేశాలు అనుమానించినట్లుగా రష్యా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి సైన్యాన్ని తూర్పు నగరం ఇజియం, డొన్మెట్క్స్ చుట్టు మోహరించి దాడులను ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పుతిన్ సేనల బాంబులు, కీవ్, చెర్నిహివ్‌లోని ఇళ్లు, దుకాణాలు, లైబ్రరీలు, ఇతర పౌర ప్రదేశాలపై పడ్డాయని వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి సాధించేందుకు.. కీవ్ సహా ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు తగ్గించుకుంటామని చెప్పిన రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్ మండిపడుతోంది.

క్షిపణులతో దాడులు కొనసాగింపు
ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలపై కూడా.. దాడుల తీవ్రత పెంచిందన్న అధికారులు యుద్ధాన్ని ముగించాలన్న ఉద్దేశ్యం రష్యాకు లేదని వారు అభిప్రాయపడ్డారు. రష్యా పూర్తిగా అబద్దం ఆడుతోందని చెర్నిహివ్ సిటీ కౌన్సిల్ సెక్రటరీ ఒలెగ్జాండర్ లోమాకో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కీవ్, చెర్నిహైవ్ నగరాలపై దాడుల ఉద్ధృతి తగ్గిస్తామని రష్యా చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. మైకొలీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. మరియుపోల్, చెర్నీహివ్ ప్రాంతాలపై మాస్కో సేనలు జరిపిన దాడిలో స్థానిక మార్కెట్ సహా, రెడ్‌క్రాస్ భవనం, పలు ఇళ్లు, లైబ్రరీలు ధ్వంసం అయ్యాయి.

భారీ నష్టం - యుద్దం ముగిసేదెన్నడు
రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 145 మంది చిన్నారులు మరణించగా, 17వేల 300 మంది మాస్కో సేనలని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 40లక్షలకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లారని, అందులో సగం మంది చిన్నారులు ఉన్నారని.. ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. రష్యా తన దాడులు కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా రష్యా పైన ఎన్ని రకాల ఆంక్షలు అమలు చేసినా వెనక్కు తగ్గటం లేదు. ఇస్తాంబుల్ లో జరిగిన చర్చల తరువాత ఇక, యుద్దం చివరి దశకు వచ్చిందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ, ఇంకా దాడులు కొనసాగుతున్న వేళ.. యుద్ద ముగింపు పైన అస్పష్టత కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications